కాయ్ రాజా.. కాయ్!
పాతిక ఎకరాల్లో బరి
బాపట్ల జిల్లాలో జోరుగా కోడి పందేలు
అధికార పార్టీ నేతల అండదండలు
చెరుకుపల్లి తూర్పుపాలెంలో భారీ బరి
అంతే జోరుగా పేకాట శిబిరాలు
చుట్టుపక్కల జిల్లాల నుంచి జనం రాక
రూ. కోట్లలో చేతులు మారుతున్న నగదు
కనీసం కన్నెత్తి చూడని అధికారులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: తూర్పుపాలెం బరిలో ఉదయం నుంచి రాత్రి వరకూ కోడి పందేలు కొనసాగాయి. పేకాట శిబిరాలు రాత్రిపూట కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడికి బాపట్ల జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచే కాక హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. బరితోపాటు చుట్టుపక్కల పొలాలు జనంతో కిటకిటలాడాయి. పందెం రాయుళ్లు జోరుగా కోడిపందేలలో పాల్గొనగా, చూసేందుకు వచ్చిన వేలమంది పై పందేలు వేశారు. తొలిరోజే రూ.కోట్లలో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. పార్కింగ్, భోజనాలు, తినుబండారాలు, కూల్‌డ్రింక్ దుకాణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించారు. బరుల వద్దే నిబంధనలకు పాతరేసి మద్యం విక్రయ దుకాణాలు తెరిచారు. మరోవైపు గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అందుబాటులో ఉండడంతో ఎక్కువమంది రాత్రిళ్లు అక్కడే మకాం వేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఎక్కడికక్కడే...
వేమూరు నియోజకవర్గంలో వేమూరులో కోడి పందేల బరిని ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రారంభించారు. చావలి– కోడిపర్రు మధ్యన, కొల్లూరు మండల కేంద్రం సమీపంలో క్రాప, ఇదే మండలంలోని అనంతవరం, చుండూరు మండలం వేటపాలెం వద్ద బరులు సిద్ధం చేశారు. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గంజాంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో కోడి పందేలు జరగనున్నాయి. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లోని సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించనున్నారు. అధికార పార్టీ నేతలే వీటిని నిర్వహిస్తుండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ప్రెస్‌మీట్లు పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పండుగ పేరుతో సామాన్యుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
కాయ్ రాజా.. కాయ్!


