అధికారుల నిర్లక్ష్యంపై రైతు నిరసన
ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా
వారసత్వ భూమిని ఆన్‌లైన్‌లోకి చేర్చడం లేదు
ఈ కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదు
ఎంపీ, ఎమ్మెల్యేలను నిలదీసిన తిమ్మాపురం రైతు
యడ్లపాడు: ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారుల ఉదాసీనతపై ఓ రైతు బహిరంగంగానే తన నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని తిమ్మాపురంలో జరిగిన బహిరంగ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలోనే అధికారుల తీరును ఎండగట్టారు. ఐదు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానంటూ గ్రామానికి చెందిన రైతు రాధాకృష్ణ వేదిక వద్దకు వచ్చి తన ఆవేదనను వెలిబుచ్చారు. ఐదు దశాబ్దాల క్రితం వారసత్వంగా వచ్చిన భూమికి పలు కారణాలు చూపి ఆన్‌లైన్ ఎక్కించడం లేదని వాపోయారు. దీంతో అర్హత ఉన్నా గత రెండు విడతలుగా ’అన్నదాత సుఖీభవ’ పథకం వర్తించడం లేదని ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదుపై స్పందించిన ఎంపీ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల సర్వేలో ఇబ్బందులు ఉన్నా, పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లినా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ప్లాంట్, పార్కులో వాలీబాల్ కోర్టు, జెడ్పీహైస్కూల్లో క్రీడామైదానం అభివృద్ధి పనుల్ని ప్రారంభించి, గ్రామస్తులు నాగండ్ల రాంబాబు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన అరెకరం స్థలంలో నిర్మించనున్న హిందూ స్మశాన వాటికకు భూమిపూజ చేశారు. శీతాలాంబ(బొడ్డురాయి), గ్రామదేవతల వద్ద పూజల్లో పాల్గొన్నారు.


