మళ్లీ ప్రారంభించడం హాస్యాస్పదం
ఒకసారి ప్రారంభించిన భవనాన్ని
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పిడుగురాళ్ల పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తే ఇప్పుడు నేడు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తామే నిర్మాణం పూర్తి చేశామంటూ మంత్రులను పిలిపించి ప్రారంభోత్సవం చేయించటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విమర్శించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయ భవనం చిన్నగా, ఇరుకుగా ఉండడం గమనించి, ఎంపీడీఓ కార్యాలయం పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ భవనాన్ని మున్సిపల్ కార్యాలయానికి అప్పగించేలా చర్యలు చేపట్టారురన్నారు. వెంటనే రూ.1.20కోట్లతో మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం ప్రారంభించి, పూర్తిగా నిర్మించారన్నారు. అప్పటి మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణతో ప్రారంభోత్సవం కూడా చేశారన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే యరపతినేని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన నూతన మున్సిపల్ భవనం ముందు వాటర్ ఫౌంటెన్ నిర్మించి భవన నిర్మాణం మొత్తం తామే చేశామంటూ బిల్డప్ ఇచ్చుకోవటం హాస్యాస్పదమన్నారు. పైగా ఒకసారి ప్రారంభించిన భవనాన్ని మున్సిపల్ మంత్రి పి.నారాయణ చేత మళ్లీ ప్రారంభించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాబట్టే భవన ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేశామన్నారు. అదేవిధంగా పిడుగురాళ్ల పట్టణానికి పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ పట్టణానికి గత ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన యరపతినేని శ్రీనివాసరావు ఒక చుక్క నీరు అందించలేకపోయాడని, అదే కాసు మహేష్‌రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసినా.. పిడుగురాళ్ల పట్టణంలో సుమారు 8 వేల ఇళ్లకు మంచినీటిని అందించారని, పట్టణ సమీపంలో మెడికల్ కళాశాల, వైద్యశాలను నిర్మించారని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ఐలాండ్ సెంటర్‌లో జాతీయ నేతల విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా, అవమానకరంగా తొలగిస్తూ..ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటమేమిటని ప్రశ్నించారు. వెంటనే జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ మాదాల కిరణ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జైలాబ్దిన్, కౌన్సిలర్లు నంధ్యాల బాబు, గుర్రం అప్పిరెడ్డి, షేక్ అబ్దుల్లా, కాండ్రగుంట శ్రీనివాసరావు, షేక్ కరిముల్లా, నేలటూరి బాలస్వామి, జడ సురేంద్ర, జూలకంటి శ్రీనివాసరావు, షేక్ సైదావలి, కో–ఆప్షన్ సభ్యులు పిల్లి ప్రేమానందం, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు కాండ్రగుంట కన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.
పిడుగురాళ్ల మున్సిపల్ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని
బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు


