పీజీఆర్‌ఎస్ అర్జీలకు ప్రాధాన్యమివ్వాలి
జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
రుణం మంజూరైందని మోసం
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని...
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్ అర్జీలకు మొదటి ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం వంటి సమస్యలపై 62 ఫిర్యాదులు అందాయి.
గ్రామంలో సెల్‌షాపు, కస్టమర్ బిజినెస్, ఇన్‌కమింట్ క్యాష్ అవుట్ గో క్యాష్ లావాదేవీలు జరుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈనెల 3వ తేదీ అజ్ఞాత వ్యక్తి షాపునకు వచ్చి సలీం మహమ్మద్ అనే వ్యక్తి మొబైల్ నెంబర్ నుంచి ఫోన్‌పే చేస్తారు క్యాష్ ఇవ్వాలని కోరాడు. నగదు జమ అయినట్టు యూపీఐ ఐడీ నుంచి వచ్చిన ధృవీకరణ చూపించడంతో రూ.20వేలు చెల్లించా. నగదు తన అకౌంట్‌లో జమకాకపోవడంతో బ్యాంక్‌ను సంప్రదించాను. యూపీఐ నెంబరుపై సైబర్ క్రైమ్ నమోదు అయిందని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అకౌంట్ హోల్డ్ నుంచి క్లియరెన్స్ చేయించి నగదు ఇప్పించాలి.
–వనమా వీరబాబు, బ్రాహ్మణపల్లి,
పిడుగురాళ్ల మండలం
నెల రోజుల కిందట ప్రకాష్‌నగర్‌లో పరిచయస్తుడైన ముల్లెట్ రాజు ఎదురుపడి స్కూటీ అవసరం అని, వెంటనే ఇస్తానని తీసుకెళ్లాడు. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానంతో ఇంటికి వెళ్లి అడగ్గా డబ్బులు అవసరమై తాకట్టు పెట్టానని, స్కూటీ బదులు రూ.65వేలు నగదు ఇస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడు నగదు అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకుని, నాకు న్యాయం చేయండి.
–రావూరి వెంకట కోటేశ్వరరావు,
శ్రీనివాసనగర్, నరసరావుపేట
బెంగళూరుకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి 20 రోజుల కిందట ఫోన్ చేసి రూ.10 లక్షలు లోన్ మంజూరైందని చెప్పి ఐడీ ప్రూప్స్ తీసుకున్నాడు. ఇందుకు చార్జీల కోసం రూ.4700, ఇన్సూరెన్స్ కట్టాలని రూ.20వేలు, జీఎస్‌టీ చెల్లించాలని రూ.32వేలు వసూలు చేశాడు. రుణం గురించి అడిగితే ప్రాసెస్‌లో ఉందని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ తరువాత ఫోన్ లిప్ట్ చేయడం మానేశాడు. దీనిపై దుర్గి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. నాకు న్యాయం చేయండి
–జరపల కోటేశ్వరరావు నాయక్,
నిదానంపాడు, దుర్గి మండలం
ఓబులేసునిపల్లికి చెందిన బాలునాయక్, చైనా బాబుతోపాటు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న డెప్యూటీ తహసీల్దార్ వీఎస్ పవన్‌కుమార్‌లు 2023లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.15లక్షలు తీసుకున్నారు. రెండు సంవత్సరాలు గడిచినా వారి నుంచి స్పందలేదు. పని జరుగుతుంది త్వరలోనే ఉద్యోగం వస్తుందని మాటలు చెబుతున్నారు. అప్పులు తీసుకువచ్చి వారికి డబ్బులు ఇచ్చానని, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాను. మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.
–రమావత్ హనుమానాయక్,
తండా, కారంపూడి మండలం


