కమీషన్ ఇస్తేనే రుణం
బ్యాంకుల్లో టీడీపీ నాయకులు తిష్ట టీడీపీ నాయకులు చెప్పిన వారికే రుణాలు డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఆవేదన గురజాల నియోజకవర్గంలో 4,267 డ్వాక్రా గ్రూపులు
టీడీపీ నాయకుల అనుమతి తప్పనిసరి
కాసులిస్తేనే రుణాలు
పిడుగురాళ్లరూరల్: ఒక వైపు అక్కచెల్లెమ్మల ఆర్థికాభివద్ధికి ఆసరాగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు మరో వైపు అక్కచెల్లెమ్మలను కమీషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఒక వైపు డ్వాక్రా రుణం మంజూరైందని ఆనందపడేలోపే.. మరో వైపు కమీషన్ ఇస్తేనే రుణం చేతికొస్తుందంటూ వేధిస్తున్నారు. గురజాల నియోజవర్గంలో డ్వాక్రా అధికారులు, కూటమి నాయకుల అవినీతికి అడ్డు చెప్పలేక డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో మొత్తం 4,267 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల నిర్వహణ కోసం ప్రతి గ్రామానికీ ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున యానిమేటర్లు ఉన్నారు. ఒక్కొక్క యానిమేటర్ పరిధిలో సుమారు 20 నుంచి 40 గ్రూపులు ఉన్నాయి. యానిమేటర్లు, టీడీపీ గ్రామ నాయకులు కలిసి డ్వాక్రా సంఘాల వద్ద వాటలు తీసుకుంటున్నారు. కొంతమంది నాయకులు గ్రామంలో మేము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరి కొంతమంది నాయకులు బ్యాంకుల్లో కూర్చొని ఎవరరికి రుణం వస్తుందనే సమాచారం తెలుసుకుని వారికి మంజూరు చేయాలా వద్దా అంటూ మేనేజర్‌ను ఆదేశిస్తున్నారు.
సకాలంలో అప్పు తీర్చినా కష్టమే..
టీడీపీ నాయకులకు కమీషన్ ఇవ్వకుంటే పొదుపు సక్రమంగా కడుతున్న, బకాయిలు లేకుండా బ్యాంక్‌కి ప్రతి నెలా అప్పులు చెల్లించినా రుణం మంజూరు కష్టంగా ఉంది. దీంతో కొత్త రుణం తీసుకుని చిరు వ్యాపారాలు పెట్టుకుందామనుకునే వారి ఆశలు అడియాశలవుతున్నాయి. నిజాయితీగా అప్పులు తీర్చినా ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే తొలగిస్తాం..
కమీషన్ల వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని గ్రూపు నుంచి తొలగిస్తామని యానిమేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికి సీసీ, ఏపీఎం తెర వెనుక వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి డ్వాక్రా అధికారులు, రాజకీయ నాయకుల అవినీతికి అడ్డుకట్ట వేయాలని మహిళలకు కోరుతున్నారు.
సీసీల చేతివాటం
సీసీలు కొంతమంది గ్రూపుల పేర్లు చెప్పి మండల సమైక్యలో ఉండే డబ్బులను కాజేస్తున్నారు. ఆ గ్రూపులో కూడా తెలియకుండానే డబ్బులను డ్రా చేస్తున్నారు. తీరా తెలుసుకుంటే మేము డబ్బులు కడతాం మీకు ఏమీ ఇబ్బంది లేదు అంటూ ఆ గ్రూపు సభ్యులకు చెబుతున్నారు. మాకు తెలియకుండా మా గ్రూపు నుంచి ఎలా డబ్బులు తీస్తున్నారఅని గ్రూప్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
డ్వాక్రా సంఘాల నుంచి తప్పుకుంటున్న మహిళలు
అధికారులు, టీడీపీ నాయకుల అవినీతి కారణంగా కొంతమంది మహిళలు గ్రూపుల నుంచి వైదొలగుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సంఘాలలో కొనసాగుతూ, సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నా లోన్లు రానివ్వకుండా కూటమి నాయకులు అడ్డుపడుతుండడంతో కోనంకి గ్రామంలోనే ఇప్పటికి 8 గ్రూపులు రద్దు చేసుకోగా అదే బాటలో పయనించేందుకు మరికొన్ని గ్రూపులు సిద్ధంగా ఉన్నాయి.
రుణం మంజూరు కోసం ఫైలు బ్యాంకుకి వెళ్లాలంటే టీడీపీ నాయకుల అనుమతి తప్పనిసరి. ఒక గ్రామంలో ఒక గ్రూపునకు మూడు నెలలు, ఒక గ్రూపుకు ఏడు నెలలు అవుతున్న ఫైలు పెట్టక ఇబ్బంది పెడుతున్నారు. దీనికి కారణం ఆ గ్రూపులకు ఆ ఊరి నాయకుడు అనుమతి ఇవ్వలేదు. ఈ గ్రూపులో సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీలు. అయినా కూడా ఆ గ్రామ నాయకుడు ఆ ఫైలు ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాడు.
దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్లుంది నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపుల పరిస్థితి. డ్వాక్రా మహిళలకు ఎలాంటి నిబంధనలు లేకుండా రుణాలిస్తుంటే.. ఆ రుణం సంఘాల సభ్యులకు చేరాలంటే మాత్రం యానిమేటర్ నుంచి కూటమి రాజకీయ నాయకుల వరకు చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ గ్రామంలో నాలుగు సంఘాల సభ్యులకు రుణాలు మంజూరయ్యాయి. రుణాలు బ్యాంకుల నుంచి సభ్యుల ఖాతాల్లో జమ చేయాలంటే యానిమేటర్ తీర్మానం రాసి సీసీ, ఏపీఎం సంతకాల ద్వారా అప్రూవల్ చేయించాలి. రుణం మొత్తం రూ.పది లక్షల అయితే గ్రూపు సభ్యుల నుంచి యానిమేటర్లు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీరికి ముందుగా లంచమిస్తేగానీ బ్యాంకులో తీర్మానం ప్రవేశం పెట్టడం లేదు. చేసేదేమీలేక పలు సంఘాల సభ్యులు ముందుగానే నగదు ఇస్తున్నారు.


