కనుల పండువగా నగర సంకీర్తన
తెనాలిటౌన్: ఆధ్యాత్మిక భావనతోనే మానవ జన్మ చరితార్థమవుతుందని, ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలమని సంగీత విద్వాంసురాలు నేరెళ్ల వరలక్ష్మి కళ్యాణి అన్నారు. ధనుర్మాసం సందర్భంగా తెనాలిలో ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. మహిళలు వీధులలో భజనలు, నృత్యం చేస్తూ భక్తిని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే దిశగా కృషి చేశారు. ధనుర్మాసం అనగా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం వంటిదని, ఈ రోజుల్లో దేవతలు అత్యంత ప్రీతి చెందుతారని చెప్పారు. పూజా, గానం, యజ్ఞం, ఇత్యాది విషయాలు సంపూర్ణంగా స్వీకరిస్తారని వివరించారు. కార్యక్రమంలో చిన్నమయి సంగీత శిక్షకులు ఆంజనేయశాస్త్రి, నృత్య గురువు నిర్మల రమేష్, ఎన్‌సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, గాయని వఝుల సునీత, తదితరులు పాల్గొన్నారు.
కొల్లూరు: గంధ మహోత్సవ వేడుకలు బాపట్ల జిల్లా కొల్లూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌లో వెలసిన హజరత్ ఖాజ్వా గరీబ్ నవాజ్ రహమతుల్లా అలైహి పేరిట ముస్లింలు భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం జరిపారు. తొలుత స్థానిక జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం, ప్రత్యేకంగా అలంకరించిన జెండాను కొల్లూరు వీధుల్లో ఊరేగింపుగా తర లించారు. గంధ మహోత్సవ వేడుకలలో హిందువులు పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ప్రసాదాలు పంపిణీ చేశారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం కూడారై మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి మంగళ శాసనాలతో 108 గంగాళాలతో కూడారై ప్రసాదం (పాయసం) పాత్రలను గోద రంగనాథులకు సమర్పించామని, అనంతరం పాసుర విన్నపాన్ని గావించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి గోదా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసం సందర్భంగా కూడారై మహోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారని తెలిపారు.
తెనాలిటౌన్: శ్రీ శరణాగతి గోష్టి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలోని వీఎస్సార్ కళాశాల రోడ్డులో జరుగుతున్న 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా 27వ రోజు ఆదివారం వేలాది మంది భక్తులు పాల్గొని 581 ఇత్తడి గంగాళాలతో స్వామివారికి పాయస నివేదన చేశారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నిష్టగా భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అనంతరం పాయస నివేదన చేశారు.
సత్తెనపల్లి:ధనుర్మాసా న్ని పురస్కరించుకొని పట్టణంలోని వడ్డవల్లి రామాలయం, వేంక టేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం కూడారై ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలకు ప్రత్యేక అలంకరణ చేశారు.
కనుల పండువగా నగర సంకీర్తన
కనుల పండువగా నగర సంకీర్తన
కనుల పండువగా నగర సంకీర్తన


