సంక్రాంతికి ఊరెళుతున్నారా..!
జాగ్రత్తలతోనే సంతోషమయం కానున్న సంక్రాంతి ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతులు పండగ నేపథ్యంలో ప్రజలకు పోలీసుల సూచనలు
సమాచారం ఇవ్వండి
సత్తెనపల్లి: సంక్రాంతి సంబరాల సమయం ఆసన్నమైంది. ఇక సోమవారం నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలు సంక్రాంతి పండు గ బిజీలో ఉన్నారు. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు విధిగా తమ సొంతూళ్లకు చేరుకుంటారు. ఇందుకోసం రెండు నెలల ముందు నుంచే రైళ్లల్లో, బస్సుల్లో రిజర్వేషన్ చేయించుకుంటారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో చాలామంది సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లారు. ఇక ప్రైవేట్ సంస్థల్లో, కార్యాలయాల్లో పనిచేసే వారికి ఆదివారం సెలవు కావడంతో చాలా మంది స్వగ్రామా లకు పయనమయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నారు. అయితే ఊర్లకు వెళ్లేవారు తమ ఇంటి విషయంలో, ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకుంటేనే సంక్రాంతి సంతోషమయం కాగలదని, లేకుంటే ఆభరణాలు, నగదు వంటివి దొంగల పాలవుతాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రయాణ సమయంలో జాగ్రత్తలు ఇలా...
● రైళ్లల్లో ప్రయాణించేవారు తమ లగేజీ బ్యాగులకు చైన్‌వేసి తాళం వేసుకోవాలి.
● రైల్వేస్టేషన్, బస్టాండుల్లో మంచినీళ్లకు, వాష్ రూములకు వెళ్లే సమయంలో తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో లగేజీ అప్పగించకూడదు.
● తోటి ప్రయాణికులు ఏవైనా తినుబండారాలు ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాలి.
● బస్సులన్నీ రద్దీగా ఉంటాయి. బస్సు ఎక్కేటప్పుడు ముఖ్యంగా మహిళల మెడలో ఉండే బంగారు ఆభరణాలను దొంగలు దొంగిలిస్తారు. అందువల్ల మెడలోని నగలు కనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలి.
● ప్రయాణ సమయంలో బంగారు ఆభరణాలు తక్కువగా ధరించడం మంచిది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు ఉన్నందున ఎక్కువ మొత్తంలో డబ్బులు వెంట తీసుకెళ్లకూడదు.
● షాపింగ్ చేసేటప్పుడు తమ బ్యాగులు, పర్సులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. పిక్ పాకెటర్స్ ఉంటారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు హ్యాండ్‌లాక్ తప్పని సరిగా వేసుకోవాలి.
సంక్రాంతికి చాలా మంది సొంత ఊళ్లకు వెళతారు. అలా వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్లన వారి ఇళ్ల పై ప్రత్యేక నిఘా ఉంచుతాం. ఎల్‌హెచ్‌ఎంఎస్ పెడతాం. సంక్రాంతికి అన్ని ప్రాంతాల్లో గస్తీ పెంచుతాం. విలువైన వస్తువులు గృహాల్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. అనుమానితుల సమాచారం అందించాలి. ప్రజల అప్రమత్తతోనే దొంగతనాల నివారణ సాధ్యం.
– నరహరి నాగమల్లేశ్వరరావు,
సీఐ, సత్తెనపల్లి
ఇంటి వద్ద ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి...
ఊరికి వెళ్లే సమయంలో ఇంటిలోని అన్ని తలుపులకు తాళాలు వేసుకోవాలి.
ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారానికి వేసే తాళం నాసిరకం కాకుండా చూసుకోవాలి.
తాళం వేసినట్లు కనిపించకుండా కర్టన్ వేసి ఉంచాలి.
ఇరుగు, పొరుగు వారికి తమ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి.
రోజుకు ఒకటి, రెండుమార్లు తమ ఇంటి గురించి ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉండాలి.
నమ్మకమైన వ్యక్తులను రాత్రి వేళల్లో ఇంటిలో పడుకునే ఏర్పాటుచేసుకోవడం సురక్షితం.
బంగారు ఆభరణాలను లాకర్‌లో భద్రపరుచుకోవడం శ్రేయస్కరం.
ప్రస్తుతం మార్కెట్లో వైఫైతో కూడిన సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటు న్నాయి. అందరి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉన్నందున ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఫోన్‌కు అనుసంధానం చేసుకుంటే ఎప్పటిక ప్పుడు ఇంటిని పరిశీలించుకుంటూ ఉండవచ్చు.
ఎక్కువ రోజులు ఇంటికిరాని వారైతే సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలి.
సంక్రాంతికి ఊరెళుతున్నారా..!


