ఓబన్న ఆశయాలు స్ఫూర్తిదాయకం
నరసరావుపేట రూరల్: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్ తెలిపారు. ఓబన్న జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఓబన్న చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ సంతోష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఓబన్న చేసిన త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, వెల్పేర్ ఆర్‌ఐ ఎల్.గోపీనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
రొంపిచర్ల: ‘ఫోన్ పే చేస్తాం.. పెట్రోల్ కొట్టండి’ అంటూ బంక్‌లోని ఆపరేటర్ వెంకట కృష్ణపై దుండగులు దౌర్జన్యం చేసిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని ఓ బంక్‌లో చోటుచేసుకుంది. అతడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు... శనివారం రాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ బంక్‌లోకి వచ్చారు. వారిలో ఒకడు వచ్చి ఆపరేటర్‌తో రూ.5 వేలు ఫోన్ పే చేస్తామని చెప్పాడు. రూ. 2 వేలకు పెట్రోల్ కొట్టి, రూ.3 వేలు నగదు ఇవ్వాలని అడిగాడు. ఫేక్ మెసేజ్ చూపాడు. పెట్రోల్ పోయించుకున్నాక, రూ.3 వేలు నగదు అడిగాడు. తనకు మెసేజ్ రాలేదని, స్కానర్‌తో డబ్బు పంపాలని ఆపరేటర్ చెప్పారు. ఇంతలో కారులోని మరో ఇద్దరు వచ్చి ఆపరేటర్ మెడలో ఉన్న డబ్బు సంచి లాక్కున్నారు. ఆపరేటర్ సంచి పట్టుకొని వదలకుండా వారితో పెనుగులాడాడు. కారులో వెంకట కృష్ణను బలవంతంగా ఎక్కించి తీసుకుపోయేందుకు ప్రయత్నించారు. ఇంతలో వేరేవారు అటుగా రావడంతో దుండగులు అతడిని కారులో నుంచి బయటకు నెట్టి పరారయ్యారు. ఈ పెనుగులాటలో వెంకటకృష్ణ ఫోన్ కారులో పడిపోయింది. అతడి తలకు గాయాలు అయ్యాయి. నరసరావుపేట వైద్యశాలలో అతడు చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో నకరికల్లులో కూడా ఓ బంక్‌లో ఇదే ముఠా రూ.5 వేలను కాజేసినట్లు సమాచారం.


