ముగిసిన చెస్ టోర్నమెంట్
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన అండర్–15 చెస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. బాలికల విభాగంలో నూతి ధార్మిక ప్రథమ బహుమతి కై వశం చేసుకోగా సాయిభాస్కర అలేఖ్య, మన్నే సహస్రచౌదరి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే బాలుర విభాగంలో కొల్లా భావన్ ప్రథమ, ఎ.హరిసూర్యనారాయణ ద్వితీయ, బి.ప్రజిత్ తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్, డైరెక్టర్ నాగోతు సబిత, ఎండీ వి.వి.నరసయ్య, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా రవీంద్రరాజు, టోర్నమెంట్ నిర్వాహకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం గ్రామం ఎన్నెస్పీ కెనాల్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కోళ్లతోపాటు రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు ఆదివారం తెలిపారు. గ్రామాల్లో నిఘా ఉంచామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చట్టరీత్యా నేరమన్నారు.
శావల్యాపురం: సంక్రాంతి సందర్భంగా మండలంలోని కారుమంచి గ్రామంలో శ్రీతారకరామ కళాపరిషత్ ఆధ్వర్యంలో ద్వితీయ నాటకోత్సవాలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు నిర్వాహక కమిటీ ప్రతినిధి కూచి రామాంజినేయులు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కర్రి కనకనారాయణ కళా ప్రాంగణంలో ‘పండగొచ్చింది.. పల్లెకు రండి’ పేరుతో నాటకాలు, ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.


