అవసరమైతేనే యూరియా కొనాలి
నకరికల్లు: యూరియాను అవసరం మేరకే కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు రైతులకు సూచించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలోని యూరియా, ఇతర ఎరువుల నిల్వలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఈ పంట నమోదును చేయించాలన్నారు. 40 టన్నుల యూరియా పంపిణీకి పలు సూచనలు చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ పురోగతిపై సమీక్షించారు. ఎంఏఓ కె.దేవదాసు, పీఏసీఎస్ అధ్యక్షుడు తిరుమలశెట్టి వెంకట్రావు, కార్యదర్శి కె.ప్రసాద్, డైరెక్టర్ పి.వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై.ప్రభాకర్, పి.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోపాటు క్రీడాస్ఫూర్తి
అలవరుచుకోవాలి
చోడవరం సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైజాగ్ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ బలగ గీతాలక్ష్మి అన్నారు. శనివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో వికాస్‌నగర్‌లోని భాష్యం స్పోర్ట్స్ ఎరీనా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో భాష్యం సెంట్రల్ లెవల్ ఒలంపస్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ గీతాలక్ష్మి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఎంచుకున్న రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. వీటిలో త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, రిలే రేస్ పోటీలు జరుగుతాయని, వీటితో పాటు భాష్యం క్రికెట్ లీగ్ పోటీల్లో 8 జోనల్ జట్లు పాల్గొంటాయన్నారు. తొలుత భాష్యం ఒలంపస్, భాష్యం జెండాలను ఎగురవేసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు చైర్మన్ భాష్యం రామకృష్ణ ట్రోఫీలను అందజేశారు. వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ పాల్గొన్నారు.
అవసరమైతేనే యూరియా కొనాలి


