పెండింగ్ పనుల పూర్తికి చర్యలు
నరసరావుపేట రూరల్: జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పెండింగ్ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని జేఎన్‌టీయూ కాకినాడ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. కాకానిలోని జేఎన్‌టీయూ నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలను శనివారం పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబులతో కలిసి ఆయన సందర్శించారు. కళాశాలలో నిలిచిపోయిన నిర్మాణాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించారు. అధ్యాపకులు, భోధనేతర సిబ్బందితో విడివిడిగా సమావేశమయ్యారు. సౌకర్యాలపై ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. త్వరలో 80 మంది బోధనా సిబ్బంది, 88 మంది బోధనేతర సిబ్బందిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. బోధనేతర సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


