జిల్లా కోర్టు ఆవరణలో యువజనోత్సవాలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ హాజరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి కూడా..
గుంటూరు లీగల్: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కోర్టు ఆవరణలో గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి, అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. వీరికి బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత ఆశయాలను వివరించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు రచించిన సంక్రాంతి పాట సీడీని విడుదల చేశారు. ఈ సభకు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివ సూర్య నారాయణ అధ్యక్షత వహించారు.


