బైక్ అదుపుతప్పి బోల్తా..
ఒకరు మృతి , ఇద్దరికి తీవ్ర గాయాలు
రొంపిచర్ల: వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన డక్కమడుగుల రాజేష్(24) తన స్నేహితులతో కలిసి హైవే రోడ్డు మీదుగా మండలంలో అన్నవరప్పాడు గ్రామం నుండి స్వగ్రామానికి వస్తున్నారు. వేగంగా వస్తున్న బైక్ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో గ్రామానికి వెళ్లే రోడ్డు వద్దకు రాగానే ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపు తప్పి బైక్ బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న రాజేష్ క్రింద పడిపోవడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వైపున ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు.
తాడికొండ: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణానికిగాను 12.5758 ఎకరాల భూమి సేకరించేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉండవల్లిలో 10.5018 ఎకరాలు, పెనుమాకలో 0.6500 ఎకరాలు, మందడం–1లో 0.7000 ఎకరాలు, రాయపూడి–1లో 0.4710 ఎకరాలు, రాయపూడి–2 – 0.2530 ఎకరాల సేకరించనున్నారు. సంబంధిత రైతులు, భూ యజమానులు అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు సిద్ధమైతే తమ గ్రామంలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


