కేఎల్‌యూలో ఐకాన్ ప్యాక్–2026 ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ శుద్ధ, అనువర్తిత రసాయన శాస్త్ర సదస్సు (ఐకాన్ ప్యాన్ 2026) గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జి.రంగారావు, ప్రముఖ పదార్థ శాస్త్రవేత్త డాక్టర్ శ్వేత అగర్వాల్‌లు విచ్చేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు శుభ్రమైన శక్తి సాంకేతికతలు, క్వాటలిసిస్, శక్తి నిల్వ వ్యవస్థలు, పర్యావరణ పునరుద్ధణలో పదార్ధ రసాయన శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అనువర్తనాలకు సంబంధించిన ఆధునిక కార్యాచరణ పదార్థాలలో జరిగిన తాజా ఆవిష్కరణలను వివరించారు. సదస్సు కన్వీనర్ నిరంజన్ పాత్ర ఐకాన్ ప్యాక్ 2026 యొక్క దృష్టి, లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సు ద్వారా పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై కలిసి అభిప్రాయాలను పంచుకుని, ఆధునిక పరిశోధనలను ప్రదర్శించి, సహకారాన్ని పెంపొందించుకునే అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని తెలిపారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సదస్సులో కీ నోట్ ప్రసంగాలు, ఆహ్వానిత ఉపన్యాసాలు, మౌఖిక, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు.వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, ఎన్.వెంకట్‌రామ్, కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ కేఆర్‌ఎస్ ప్రసాద్, డీన్ ఎంహెచ్‌ఎస్ ఎం.కిషోర్‌బాబు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


