అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే
పిడుగురాళ్ల: అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మెడలు వంచేలా చేస్తామని వైఎస్సార్ సీపీ గురజాల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన కోటి సంతకాల మహోద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచామన్నారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు రాబోయే విద్యా సంవత్సరానికి వైద్య విద్య సీట్లు ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధమవ్వటం తమ పోరాటాలకు నిదర్శనమన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 2019లో సుమారు రూ. 66 కోట్లు మెడికల్ కాలేజీకి మంజూరు చేయించామన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి మరో రూ. 200కోట్లు మంజూరు చేయించటం, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 200కోట్లు కేటాయించటంతో సుమారు రూ.500 కోట్లతో పిడుగురాళ్ల సమీపాన వైఎస్సార్ మెడికల్ కాలేజీ, హాస్పటల్ నిర్మాణం ప్రారంభమయిందన్నారు. 2024 జూన్ కల్లా రూ.217 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కళాశాల పనులు 60 శాతం, హాస్పటల్ పనులు 90శాతం పూర్తి చేశామన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో మిగతా పనులు పూర్తిచేయలేకపోయిందన్నారు. అయితే తాము చేపట్టిన సెల్ఫీ చాలెంజ్ ఉద్యమానికి భారీ ప్రజామద్దతు లభించడంతో స్థానిక ఎమ్మెల్యే స్పందించి మెడికల్ కళాశాలకు, హాస్పటల్‌కు వెళ్లి పరిశీలించి, త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారన్నారు. పిడుగురాళ్లలోని వైఎస్సార్ మెడికల్ కాలేజీ, వైద్యశాలను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి


