జాతీయ మట్టి కుస్తీ పోటీల్లో గురుకుల విద్యార్థికి రజత పత
యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 9వ తరగతి చదివే విద్యార్థి రెంటాల మల్లికార్జున జాతీయస్థాయి మట్టి కుస్తీ పోటీల్లో తన ప్రతిభను నిరూపించాడు. ఈ ఏడాది జనవరి 3, 4,5 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి బీచ్ గ్రాప్లింగ్(మట్టి కుస్తీ) పోటీల్లో మల్లికార్జున అండర్–17 విభాగంలో పాల్గొన్నాడు. అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి నెలలో థాయ్‌లాండ్‌లో జరగబోయే అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. విద్యార్థి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ప్రిన్సిపాల్ దాసరి ప్రభాకర్ విద్యార్థి మల్లికార్జున, అతనికి ప్రత్యేక శిక్షణ అందించిన పీఈటీలు డి వీరయ్య, పి సియోనులను కొనియాడారు. మల్లికార్జున థాయ్‌లాండ్‌లో జరిగే పోటీల్లోనూ స్వర్ణ పతకం సాధించి దేశానికి, పాఠశాలకు కీర్తి తీసుకురావాలని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


