స్కౌట్ శిక్షణతో సేవాభావం పెంపు
తాడికొండ: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, పీఎంసీ పాఠశాలల్లో మహిళ ఉపాధ్యాయులకు గైడ్ కెప్టెన్, ఏడు రోజుల బేసిక్, అడ్వాన్స్ కోర్స్ శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించినట్లు జిల్లా సెక్రటరీ ఎం.ఏడుకొండలు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణకు హాజరైన వందమంది మహిళ ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యాశాఖ అధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో స్కౌట్ ద్వారా సేవా భావాన్ని దేశభక్తిని క్రమశిక్షణ పెంపొందించాలన్నారు. విద్యార్థుల్లో తగ్గుతున్న నైతిక విలువలను పెంపొందించడానికి స్కౌట్ ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 20 నుంచి పీఎం శ్రీ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ బాల బాలికలకు ఐదు రోజుల ద్వితీయ సోపానం శిక్షణ కార్యక్రమం డివిజన్లవారీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కౌట్ ఉపాధ్యాయులు విద్యార్థులను సంసిద్ధం చేసి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో 66మంది బేసిక్ 34 మంది అడ్వాన్స్ కోర్సుకు హాజరయ్యారని కోర్సు లీడర్ ఎస్‌ఓటీ ఉమాదేవి తెలియజేశారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కామాక్షి, రిసోర్స్ పర్సన్స్ మహాదేవమ్మ, శకుంతల, గిరిజాకుమారి, వర కమలాదేవి, ఎస్‌ఓసీ శ్రీనివాసరావు, స్కౌట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


