యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
నరసరావుపేట: గుంటూరులోని ఏసీ కాలేజీలో ఈ నెల 10, 11 తేదీలలో నిర్వహించే యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు కోరారు. మంగళవారం సాయంత్రం కార్యాలయంలో రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు పతాకావిష్కరణ, అనంతరం ప్రారంభ సభ, మధ్యాహ్నం పెద్ద ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. టెట్ రద్దు చేయాలని, పీఆర్‌సీ కమిటీ నియమించాలని, ఆర్థిక బకాయలు చెల్లించాలని, బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఇతర ప్రధాన డిమాండ్లతో మహా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రతినిధులతో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుందని అన్నారు. మరుసటి రోజు 11వ తేదీ ప్రతినిధుల సభ కొనసాగుతుందని, రాష్ట్రశాఖ నూతన కౌన్సిల్ ఎన్నికతో మహాసభలు ముగుస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు భాగేశ్వరిదేవి, జిల్లా కార్యదర్శులు ఉషా శౌరి రాణి, రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిలర్ సుందరరావు, సౌహార్ద్ర ప్రతినిధి వెంకటేశ్వర్లు, నరసరావుపేట ప్రాంతీయ శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.


