తరగతి గదిలో స్పృహ కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని
సత్తెనపల్లి: తరగతి గదిలో ఇంటర్ విద్యార్థిని స్పృహ కోల్పోయిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాచర్ల మండలం అనుపు గ్రామానికి చెందిన నూన్సావత్ లలితా భాయ్, నానునాయక్ దంపతుల కుమార్తె పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తూ పట్టణంలోని వెంకటపతి కాలనీలో గల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహంలో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం కళాశాలలో సాయంత్రం 4:00 గంటల సమయంలో స్పృహ కోల్పోగా కళాశాల సిబ్బంది సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోబీపీ, ఎనీమియా కారణంగా ఆమె స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కొద్దిసేపటికి ఆమె కోలుకోవటంతో అటు కళాశాల, ఇటు హాస్టల్ సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.


