భక్తిశ్రద్ధలతో ముగ్గురు రాజుల తిరునాళ్ల
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ప్రత్యేక దివ్య పూజ బలిలో విదేశీ భక్తులు
పండుగ సందేశాన్ని అందించిన
ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: ముగ్గురు రాజులు మాదిరి ప్రతి కథోలికులు ఏసుక్రీస్తును అనుసరించి తమ జీవితాలను అర్పించాలని గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య అన్నారు. మండలంలోని పాటిబండ్ల గ్రామంలో ముగ్గురు రాజుల మహోత్సవం మంగళవారం క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దేవాలయం ఆవరణలో సమష్టి దివ్య పూజాబలిని పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎందరో గురువులను దైవ సేవకు ఇచ్చిన పాటిబండ్ల గ్రామం పుణ్యభూమి అని కొనియాడారు. శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత కలిగి క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని తెలిపారు. ప్రతి కథోలికులు దైవచింతనతో మెలగాలన్నారు. పూర్ణకుంభంతో భక్తులకు ఆశీస్సులు అందించారు. వేలాది మంది భక్తులు దివ్య పూజా బలిలో పాల్గొన్నారు.
ఊరంతా సందడి
ముగ్గురు రాజుల మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక మంది కథోలికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందమందికి పైగా విదేశీ భక్తులు ప్రత్యేక దివ్య పూజ బలిలో పాల్గొని మహోత్సవంలో సందడి చేశారు. కోలాటం, భజన, సాంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు. భక్తులు కొవ్వొత్తులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దైవ సేవ చేస్తున్న 100 మంది మత గురువులు, మఠ కన్యలు, మహోత్సవంలో పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
కనుల పండవగా తేరు ఊరేగింపు
ముగ్గురు రాజుల మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన భారీ బాణసంచా ఆకట్టుకుంది. అనంతరం తేరును బ్యాండ్ వాయిద్యాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ముగ్గురు రాజులకు కొవ్వొత్తులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈదా సాంబిరెడ్డి, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, వట్టి శ్లీవారెడ్డి, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, మఠ కన్యలు, పాల్గొన్నారు. సీఐ పత్తిపాటి సురేష్, ఎస్సై గిరిబాబుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య
భక్తిశ్రద్ధలతో ముగ్గురు రాజుల తిరునాళ్ల


