కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దాం
నరసరావుపేట: జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లపై తొలి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కోటప్పకొండలో జరిగే ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభలు తరలింపునకు ఎటువంటి అంతరాయం కలుగకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. ప్రభల రాకపోకలకు విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పడిన వ్యర్థాలను తొలగించే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్‌లో ఉండే భక్తులకు వాటర్ ప్యాకెట్లు అందజేయాలని కోరారు. కొండ కింద నుంచి పైవరకు భక్తుల తరలింపునకు ఘాట్ రోడ్డుకు అనువైన అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అదనపు వాహన డ్రైవర్లు, మెకానిక్‌లు, భారీగా ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంచాలని సూచించారు. 108 వాహనాలు, క్యూలైన్ల వద్ద, మెట్లమార్గంలో, కొండపైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయశాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయ పరుచుకొని, అధికారులందరితో కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రమాద రహిత జిల్లాగా పల్నాడు
పల్నాడును రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయటం కోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి కలెక్టరేట్‌లో రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలుత రహదారులు భవనాల శాఖ అధికారి గీతారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల డేటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపించారు. జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాతీయ భద్రత రహదారి ఉత్సవాలపై రూపొందించిన పోస్టర్, కరపత్రాలను కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆర్టీసీ ఆర్.ఎం టి.అజితకుమారి, ఆర్టీవో సంజీవకుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, ఎన్‌జీఓ సేఫ్టీ కన్వీనర్ దుర్గాపద్మజ, డీఎస్పీలు, ఎకై ్సజ్‌శాఖ అధికారి, అధికారులు పాల్గొన్నారు.
తొలి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ


