మోసపోయాం.. న్యాయం చేయండి
జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ బి.కృష్ణారావు
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 81 ఫిర్యాదులు అందాయి.
గుప్త నిధుల పేరిట రూ.50లక్షలు మోసం
తమ పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, పూజలు చేసి వెలికి తీయాలంటే రూ.50లక్షలు ఖర్చవుతుందని తెలంగాణ రాష్ట్రం తొర్రూరు మండల కేంద్రానికి చెందిన అల్లం ప్రసాదు, అల్లం హుస్సేన్‌లు చెప్పిన మాటలు విని మోసపోయినట్టు అమరావతి మండలం ధరణికోటకు చెందిన తాళ్లూరి శంకర్ ఫిర్యాదు చేసాడు. వినుకొండకు చెందిన కిషోర్‌బాబు ద్వారా ప్రసాద్, హుస్సేన్‌లు పరిచయమై తమకు చెందిన భూమిలో నిధి ఉందని చెప్పినట్టు పేర్కొన్నారు. నిధిని బయటకు తీయాలంటే రూ.50లక్షలు ఖర్చవుతుందని చెప్పారని, నిధి దొరుకుతుందనే ఆశలో పొలాన్ని, భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.47లక్షలను 2024 జులైలో అందజేసినట్టు తెలిపాడు. తొమ్మిది రోజుల తరువాత పూజలు చేసి తవ్వగా నకిలీ రాగి ముద్దలు, గాజు ముక్కలు, నాణేలు బయటకు తీసారన్నారు. దీనిపై ప్రశ్నించగా తమపై దాడికి యత్నించారు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
నాకు తెలియకుండా నా పేరిట రుణం
భోజన్ హోటల్‌లో కూలి పనిచేసుకునే తనకు తెలియకుండా మా యజమాని రూ.2లక్షల ముద్రాలోన్ తీసుకున్నాడని చిలకలూరిపేట సుగాలితండాకు చెందిన జల్ల ఝాన్సీ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విజయబ్యాంక్ పక్కనే ఉండే వేద సురచి హోటల్‌లో ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నానని, తన ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉపయోగించుకుని ఎస్‌బీఐలో రూ.2లక్షలు రుణం తీసుకున్నట్టు తెలిపింది. బ్యాంక్‌లో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన నాకు లోన్ విషయం బ్యాంక్ సిబ్బంది తెలిపినట్టు ఫిర్యాదులో పేర్కొంది. మోసం చేసి లోన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని..
వినుకొండ మున్సిపాలిటిలో టీఎల్‌ఎఫ్ కార్మికుడిగా పనిచేస్తున్న శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన వేల్పుల బాబురావును వినుకొండకు చెందిన ఎస్‌కే నాగూర్‌వలి ఉద్యోగం పర్మినెంట్ చేయిస్తానని మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. రాజకీయ నాయకులు తనకు తెలుసని మాయమాటలు చెప్పి తన వద్ద రూ.2లక్షలు తీసుకున్నాడని తెలిపాడు. ఉద్యోగ విషయం అడుగుతుంటే సమాధానం చెప్పకుండా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపాడు.
భార్య, ఆమె బంధువులతో ప్రాణహాని..
భార్య, వారి బంధువులు ఇంటిని ఆక్రమించారని, ప్రాణభయంతో బయట బతుకుతున్నామని వినుకొండ 16వ వార్డుకు చెందిన కోటేశ్వరరావు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఏడు నెలల క్రితం నడిగడ్డకు చెందిన గుంతనాల గోపిలక్ష్మీతో వివాహం అయినట్టు తెలిపాడు. పెళ్లి అయినప్పటి నుంచి తన ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరింపులకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత నెలలో భార్య తరఫున వారు వంద మంది ఇంటిపై దాడి చేసారని తెలిపాడు. అప్పటి నుంచి ప్రాణభయంతో ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇంటిని ఆక్రమించారని తమకు రక్షణ కల్పించాలని కోరారు.
కులం పేరుతో దూషించి, అక్రమ కేసు..
కులం పేరుతో దూషించడంతో పాటు అక్రమ కేసులు పెట్టి తనను వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు, నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన జొన్నలగడ్డ చందు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే మూడు అక్రమ కేసులు తనపై బనాయించినట్టు తెలిపాడు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై ఇంటికి వెళుతున్న తనను నిలిపివేసి గ్రామానికి చెందిన మండవ హనుమంతురావు దుర్భాషలాడాడని తెలిపాడు. కులం పేరుతో దూషించాడని.. దీనిపై నాదెండ్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు.


