‘ఉపాధి’ చట్టాన్ని యథాతఽథంగా అమలు చేయాలి
అమరావతి: 2005 నుంచి కొనసాగుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతధంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం–2025 వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ చట్టానికి వ్యతిరేకంగా స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలకమైన నాలుగు అంశాలను రద్దుచేసి కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం 2025 డిసెంబర్లో నూతన చట్టాన్ని తెచ్చి పాత చట్టంలో ఉన్నటువంటి ఉపాధికి గ్యారెంటీ అంశాన్ని రద్దు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న 90శాతం నిధులను 60 శాతానికి కుదించి రాష్ట్రాలు 40 శాతం భరించాలని సవరణ చేయటం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల పాలై అధోగతిలో ఉంటే 40శాతం నిధులు భరించే స్థితి లేక ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తాయన్నారు. పాత చట్టంలో 100 రోజులు ప్రతి కుటుంబం తమకు అవకాశం ఉన్న సందర్భంలో పనికి హాజరుకావచ్చని, కొత్త చట్టంలో ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాల్లో మాత్రమే వర్తింపచేయటం కూలీల కడుపుకొట్టటమేనన్నారు. కొత్త చట్టం వల్ల లక్షలాది గ్రామీణ వ్యవసాయ కుటుంబాలు పని లేక వలసలు పోవాల్సి వస్తుందన్నారు. అనంతరం స్థానిక గ్రామ సచివాలయం వద్ద జరుగుతున్ గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూరిబాబు, ఎస్‌కే రఫీ సయ్యద్ బహుదిన్ వలి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు నండూరి వెంకటేశ్వరరాజు, మండల కన్వీనర్ పి.సత్యనారాయణ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


