దేశీయ కూరగాయల సాగులో భేష్
ఇళ్లలోనే మొక్కలు పెంచుతూ మహిళల ప్రత్యేకత రేపల్లెలో వంద మందికిపైగా పరస్పర సహకారం
రేపల్లె: పట్టణంలో కాళేపల్లి హరిణి నేతృత్వంలో పది మంది మహిళలు ‘సా – సేవ్ – షేర్’ నినాదంతో గార్డెన్ బ్లూమ్స్ పేరుతో టెర్రస్ గార్డెన్‌ల ఏర్పాటుకు ఊతమిస్తున్నారు. 2003 నుంచి తోటి మహిళలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ జనవరి నాటికి బ్లూమ్స్ సభ్యుల సంఖ్య వంద దాటింది. దేశీయ విత్తనాలు మాత్రమే అందరూ వినియోగిస్తున్నారు. తొలుత సాగు చేసిన వారు తోటి మహిళలకు వాటిని అందిస్తున్నారు. టెర్రస్, బాల్కనీ, చిన్న ప్రాంగణాలలో టమాటా, బంగాళదుంప, బీరకాయ, నేతిబీర, చిక్కుడు, వంకాయ, బెండకాయ, మిరప, కొత్తిమీర, పాలకూర, పొట్లకాయ, సొరకాయ వంటి కూరగాయలు పండిస్తున్నారు.
పోషకాలే ప్రధానం
మార్కెట్‌లో కొత్త విత్తనాలతో పండే పంటలలో కార్బొహైడ్రేట్లు మాత్రమే ఉంటున్నాయి. ఫైబర్, ప్రోటీన్ పాళ్లు తగ్గిపోతున్నాయి. దేశీయ విత్తనాల సాగుతో ఇవన్నీ సమపాళ్లలో అందుతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. పెరటిలో నాటి ప్రకృతి సిద్ధమైన, గోఆధారిత ఎరువులతో పెంచుతున్నారు. దీంతో కూరగాయల్లో పౌష్టిక విలువలు మెరుగ్గా ఉంటున్నాయి. రైతులు సంరక్షించిన విత్తనాలను వినియోగంలోకి తీసుకురావటం ద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని మహిళలు భావిస్తున్నారు. వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్ సమావేశాల ద్వారా కొత్త వారికి సాయం చేస్తున్నారు.
దేశీయ కూరగాయల సాగులో భేష్


