ఏపీ ఎన్జీజీఓ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఘంటసాల
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం( ఏపీఎన్‌జీజీఓ) గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మలేరియా సబ్ యూనియ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఘంటసాల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరులోని ఏపీఎన్‌జీజీఓ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో సహా మొత్తం 17 పోస్టులకు గాను కేవలం 17 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి, ఎన్‌జీజీఓ సంఘ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు తెలిపారు. ఎన్నికలకు సహాయ అధికారిగా ఆనందనాథ్, పరిశీలకులుగా వి. సుబ్బారెడ్డిలు వ్యవహరించారు. మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికై ఘంటసాల రికార్డు సృష్టించారు. ఘంటసాల శ్రీనివాసరావు, ఆరాధ్య శ్యామసుందర్‌ల నాయకత్వంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం భారీ సంఖ్యలో ఉద్యోగులతో ర్యాలీ జరిగింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే ఎన్నికై న అభ్యర్థులతో ఎన్నికల అధికారి కె.జగదీశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, డి.వి.రమణల నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికలు విజయవంతంగా జరిపించిన ఎన్నికల అధికారులు కె.జగదీశ్వరరావు, ఆనందనాథ్, వి.సుబ్బారెడ్డిలను సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. సంఘం నేతలు సూరి, సిహెచ్ కళ్యాణ్ కుమార్, రమేష్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సేవా నాయక్, పాపారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
నూతన కార్యవర్గం వివరాలు...
జిల్లా అధ్యక్షుడిగా ఘంటసాల శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా సిహెచ్ రాంబాబు, ఉపాధ్యక్షులుగా డి.డి నాయక్, కె.వి.వి కిషోర్, జి.సి.హెచ్ కోటేశ్వరరావు, డి.దుర్గారావు, సి.హెచ్ అనిల్ కుమార్, మహిళా ఉపాధ్యక్షురాలుగా వి.శ్రీవాణి, జిల్లా కార్యదర్శిగా ఎ.శ్యామసుందర్ శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కే.ఎన్.సుకుమార్, సంయుక్త కార్యదర్శిలుగా సయ్యద్ జానీబాషా, కె.విజయ బాబు, డి. శ్రీనివాస్, కె.నరసింహారావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.విజయలక్ష్మి, కోశాధికారిగా ఎల్.శ్రీధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక


