మనుధర్మాన్ని మహిళలపై రుద్దుతున్న బీజేపీ
సత్తెనపల్లి: సనాతన ధర్మం పేరుతో బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని మహిళలపై రుద్దుతూ మహిళలపై దాడి చేస్తుందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని విమర్శించారు. పట్టణంలోని పార్క్‌రోడ్‌లో గల బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం ఐద్వా పట్టణ కార్యదర్శి గద్దె ఉమశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సావిత్రి బాయిపూలే జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దె ఉమశ్రీ మాట్లాడుతూ ఆ రోజుల్లో బాల్యంలోనే వివాహాలు జరగడం వల్ల భర్త చనిపోతే భార్య కూడా భర్తతోపాటు సితిమంటల్లో చనిపోవటం అంటే సతీసహగమనం దురాచారం ఉండేదన్నారు. మహిళలను చదువుకోకూడదని, భర్త చనిపోతే భార్యలు వితంతువుగానే ఉండాలనే వంటి దురాచారాలను కందుకూరి వీరేశ లింగం పంతులు, రాజా రామ్మోహన్‌రాయ్, సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్త లు ఆ దురాచారాలను రూపుమాపడంతో నేటి సమాజంలో మహిళలు అని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడి సమానత్వం వైపు పయనిస్తున్నారన్నారు. కాని నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సనాతన ధర్మం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని మహిళలపై రుద్దుతూ రూపుమాపబడిన ఆ దురాచారాలన్నిటిని మళ్లీ అమలు చేయాలని చూస్తున్నారన్నారు. అలా చేస్తే మహిళలకు పుణ్యం వస్తుందని నమ్మపలుకుతున్నారన్నారు. సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో ఆ దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వసతిగృహ విద్యార్థినులు, తదితరులు ఉన్నారు.
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రజిని


