వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి
గేదెలు కాసుకునేందుకు వెళ్లగా కర్రతో దాడి.. మెడలోని బంగారు గొలుసు అపహరణ సాయంత్రం వరకు ముళ్ల కంపల్లోనే కదల్లేని స్థితిలో బాధితురాలు గుర్తించి, ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
తాడికొండ: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వడ్డమానులో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. గేదెలు కాసుకునేందుకు వెళ్లగా కర్రతో విచక్షణా రహితంగా దాడిచేసిన గుర్తు తెలియని వ్యక్తి పరారీ కాగా రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన మేళం కోటేశ్వరమ్మ గేదెలు కాసుకునేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి కరత్రో విచక్షణరహితంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది. దీంతో దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం లాక్కెళ్లాడు. గేదెలు కాసేందుకు వెళ్లిన ఆమె సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఘటనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలికి తలకు 30 కుట్లు పడ్డాయని, ఘటన అనంతరం ఆమె మానసిక స్థితి సైతం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.


