వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటు పనుల అడ్డగింత
నరసరావుపేట: దేశ మాజీ ప్రధాని, దివంగత అటల్‌బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటును మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. వినుకొండరోడ్డులోని జూపల్లి హోటల్‌కు ఎదురుగా సెంట్రల్ డివైడర్‌పై బీజేపీ నాయకులు విగ్రహ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు నియంత్రించారు. దిమ్మె నిర్మాణానికి డిసెంబరు 31న జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో బీజేపీ నాయకులు భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరై కొబ్బరికాయ కొట్టారు. ఆ ప్రదేశంలో శనివారం నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే టౌన్‌ప్లానింగ్ అధికారి కె.సాంబయ్య తన సిబ్బంది, పొక్లెయిన్‌తో వచ్చి దిమ్మె నిర్మాణ పనులను కూలదోశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవనే కారణంతో పొక్లెయిన్‌తో దిమ్మె నిర్మించేందుకు ఏర్పాటుచేసిన ఐరన్, చెక్కల నిర్మాణాలను తొలగించారు. దీనిపై బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కృపారావు స్పందిస్తూ పదిరోజుల క్రితమే విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌కు లేఖ అందజేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు ఇవ్వలేమని అధికారులు చెప్పారన్నారు. తాము రావిపాడురోడ్డు, డీమార్టు ఎదురు ప్రదేశాల్లో విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలాలు చూసినా ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో వినుకొండరోడ్డు జూపల్లి సెంటర్ ఎన్నుకున్నామన్నారు. విగ్రహ ఏర్పాట్లను కూలదోయటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి, ఇతర రాష్ట్ర, జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వాజ్‌పేయి విగ్రహాలు ఏర్పాటుచేసేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగానే ఇక్కడ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. ఆదివారం గుంటూరులో వాయ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు కేంద్రమంత్రి హాజరవుతున్నారన్నారు. ఏదిఏమైనా తొలగించిన స్థలంలోనే మళ్లీ విగ్రహ స్థాపన ఏర్పాట్లు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై టీపీఓ సాంబయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను కలెక్టర్ సమావేశంలో ఉన్నానంటూ ఫోన్ ఆపేశారు.
అనుమతులు లేవంటూ నిర్మాణంలో ఉన్న విగ్రహ దిమ్మెను కూల్చేసిన
మున్సిపల్ అధికారులు
ఇటీవల జరిగిన విగ్రహ ఏర్పాటు
భూమిపూజలో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే, బీజేపీ నేతలు


