10న ఆర్‌ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభ
ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్‌ఎంపీ, పీఎంపీల డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి
నాదెండ్ల: గుంటూరులో ఈ నెల 10న నిర్వహించే ఆర్‌ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్‌ఎంపీ, పీఎంపీల నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి శనివారం చెప్పారు. ఈ సందర్భంగా తూబాడులో ఆయన మాట్లాడుతూ మూడు ఫెడరేషన్లతో సంయుక్తంగా ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ జరుగుతుందన్నారు. ఏటుకూరు రోడ్డులోని ఆదిత్య హాస్పటల్ ప్రాంగణంలో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రాథమిక వైద్యానికి గుర్తింపు కోసం నలభై ఏళ్లు పైబడి చేస్తున్న పోరాటం సాఫల్యం అయ్యేరోజు ఆసన్నమైందన్నారు. మహాసభకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జేఏసీ గౌరవ అధ్యక్షుడు డీటీ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని మూడు వేల మందికి పైగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు హాజరవుతారన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
తెనాలి రూరల్: కొత్త సంవత్సరం వేడుకలకు డబ్బులివ్వాలని బాలికపై బాలుడు ఒత్తిడి తీసుకురావడంతో ఎలుకల మందు తిని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైంది. బాలుడి ఖర్చులకు అప్పుడప్పుడు విద్యార్థిని డబ్బులు ఇస్తుండేది. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన తనకు రూ. రెండున్నర వేలు కావాలంటూ బాలుడు ఒత్తిడి తీసుకువచ్చాడు. తన వద్ద లేవని, రూ. వెయ్యి ఇవ్వగలనని బాలిక చెప్పింది. తాను చదువు మానేస్తానని, టీసీ తీసుకుని వెళ్లిపోతానంటూ బాలుడు ఒత్తిడి చేశాడు. దీంతో బాలిక ఎలుకల మందు తిని ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.


