బాల్య వివాహాల నివారణ అందరి బాధ్యత
నరసరావుపేట టౌన్: బాల్య వివాహాలు అరికట్టటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీఓ ప్రశాంతి అన్నారు. బాల్య వివాహ నిషేధిత చట్టంపై శనివారం పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా వారి భవిష్యత్తు, ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బాల్య వివాహం ఒక సామాజిక నేరమన్నారు. దీన్ని అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. చిన్న వయసులో గర్భం దాల్చడం వలన తల్లి, బిడ్డల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందన్నారు. పెళ్లి కారణంగా బాలికలు చదువుకు దూరం అవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే చైల్డ్ లైన్ నెంబర్ 1098 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంతోష్ కుమార్, రెండవ పట్టణ ఏఎస్‌ఐ, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, చంద్రబాబు నాయుడు కాలనీలోని అంగన్వాడి వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీఓ ప్రశాంతి


