క్రికెట్ చాంపియన్‌గా ‘ఎంబీయూ’
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26లో భాగంగా జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్‌లో తిరుపతికి చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) జట్టు విజేతగా నిలిచింది. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్ హాజరయ్యారు. ఆయన టాస్ వేసి ఫైనల్ మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఫైనల్‌లో విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీతో తలపడిన మోహన్‌బాబు యూనివర్సిటీ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి, చాంపియన్‌గా నిలిచింది. విజేతకు ఫిబ్రవరి 7వ తేదీన ముగింపు వేడుకల్లో ప్రశంసా పత్రాలు, మెడల్స్‌తోపాటు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న బ్యాట్స్‌మెన్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. జట్టులో హర్ష 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 పరుగులు, పృథ్వీ యాదవ్ 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు, ఎ.గౌతమ్ 14 పరుగులు, కెప్టెన్ దినేష్ 12 పరుగులు చేశారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ బౌలర్లలో డీకే, భవానీ ప్రసాద్ చెరో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
లక్ష్యం ఛేదించలేక..
అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాట్స్‌మెన్‌లలో సోహాన్ చౌదరి 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 పరుగులు, సాల్మన్ వెస్లీ 2 సిక్సర్‌లతో 25 పరుగులు చేసి పోరాడారు. మోహన్‌బాబు యూనివర్సిటీ బౌలర్లలో ప్రవీణ్ కుమార్, హర్ష, వివేక్ రెడ్డి తలో వికెట్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


