రాజకీయ కక్షతోనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు
మాచర్ల రూరల్: రాజకీయంగా ఎదుర్కోలేక ఆధారాలు లేకుండా ప్రతీకార భావంతో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాయడమేనని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పిన్నెల్లి సోదరుల అక్రమ నిర్భందాన్ని నిరసిస్తూ శుక్రవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి కుటుంబం 30సంవత్సరాలకు పైగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన చరిత్ర వారిదన్నారు. వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రజాభిమానాన్ని చూరగొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను రాజకీయంగా ఎదుర్కోలేక గ్రూపు తగాదాలో జరిగిన హత్య కేసులో అక్రమంగా ఇరికించి అరెస్టు చేయటం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అక్రమ, అన్యాయాలకు పాల్పడుతూ ప్రతిపక్ష నేతలను అణచివేయాలనే దుర్మార్గపు ఆలోచన మంచిదికాదన్నారు. పిన్నెల్లి సోదరులపై పెట్టిన అక్రమ కేసులను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయస్థానంపై మాకు ఎంతో నమ్మకముందని, న్యాయపోరాటం చేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలా మా పిన్నెల్లి సోదరులు వస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి జయప్రకాశరెడ్డి, ఎంపీటీసీ తేళ్లూరి శ్రీనివాసరెడ్డి, నాయకులు గోగిరెడ్డి హనిమిరెడ్డి, పాదం లక్ష్మయ్య, దశబంధపు కొండలు, గాలి బాలిరెడ్డి, జయభారత్‌రెడ్డి, ఆరికట్ల పున్నారెడ్డి తదితరులున్నారు.
నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ


