అంతర్ జిల్లా ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్
వినుకొండ: జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వినుకొండ పోలీసులు పట్టణంలోని వెల్లటూరు రోడ్డు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బొల్లాపల్లి వైపు నుంచి వస్తున్న వడితే సర్తార్‌నాయక్ అనే యువకుడిపై అనుమానం కలిగింది. బైకుపై వచ్చిన అతడిని ఆపి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఆటో డ్రైవర్ నుంచి దొంగగా..
నిందితుడు గతంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యానికి, ఇతర చెడు వ్యసనాలకు బానిస కావడంతో ఆటో కిస్తీలు కట్టలేకపోయాడు. ఫైనాన్స్ వారు ఆటోను తీసుకెళ్లిపోయారు. పాత బైక్ తాళాలను సేకరించి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. వినుకొండ బస్టాండ్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మంగళగిరి, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో ఇతను దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బైక్‌లను వెల్లటూరు గ్రామ సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో దాచి ఉంచాడు. 10 వాహనాల వివరాలు లభ్యం కాగా, మిగిలిన వాటి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న వినుకొండ సీఐ బి.ప్రభాకర్, ఎస్సై ఎ.బాలకృష్ణ, కానిస్టేబుళ్లు చాన్ బాషా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావులను డీఎస్పీ అభినందించారు. నగదు రివార్డులను అందజేశారు.
అంతర్ జిల్లా ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్


