రంగుల మహోత్సవంపై సమీక్ష
పెనుగంచిప్రోలు: భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించబోమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే అమ్మవారి రంగుల మహోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ సత్రంలోని కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా, సమన్వయంతో పని చేసి తిరుపతమ్మ రంగుల మహోత్సవం, ఫిబ్రవరిలో కల్యాణ మహోత్సవం విజయవంతం చేయాలన్నారు. ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఆలయంలో పారిశుద్ధ్యం, ప్రసాదాలపై భక్తుల నుంచి అసంతృప్తులు వచ్చాయని, ఆలయ అధికారులు వాటిని అధిగమించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆలయ ఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారులు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్‌బాబు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను పాల్గొన్నారు.


