ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
నగరంపాలెం: నూతన సంవత్సరంలో ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పలువురు పోలీస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఐజీకి మొక్కలు, పూలబొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం నూతన సంవత్సర కేక్‌ను కట్ చేశారు. అదేవిధంగా గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను పలువురు జిల్లా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ అధికార సిబ్బంది మర్యాద పూర్వకంగా కల్సి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేక్‌ను జిల్లా ఎస్పీ కట్ చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ విధులు నిర్వహిస్తోందని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), కె.సుప్రజ (క్రైం), ఏ.హనుమంతు (ఏఆర్), డీపీఓ ఏఓ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.


