పోలీసులు అదుపులో సరఫరా చేసే నిందితులు
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు తప్పని ఆందోళన
చాప కింద నీరులా వ్యాపిస్తున్న చెడు వ్యసనం
రోజురోజుకూ కేజీలలో లభ్యమవుతున్న గంజాయి
వారం వ్యవధిలోనే 10 కేజీల వరకు పట్టుకున్న పోలీసులు
పల్నాడు జిల్లాపై గంజాయి పడగలెత్తింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గంజాయి ముఠాలకు విద్యార్థులు, యువత లక్ష్యంగా మారుతున్నారు. ఎప్పటికప్పుడు సరఫరాను అడ్డుకుని, నిందితులను కఠినంగా శిక్షించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కార్ వైఖరితో పోలీసులు కూడా నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టాస్క్‌ఫోర్స్: యువత, విద్యార్థులు సరదాగా గంజాయి తాగటంతో మొదలవుతున్న ఈ వ్యసనం వారిని అన్నివిధాలా కుంగదీస్తోంది. పలు కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. గంజాయి రవాణా మాత్రం జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా యువకులను ముఠాలు మత్తులో దించుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో రోజురోజుకూ కేజీల చొప్పున లభ్యమవుతోంది. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండలాల్లో మారుమూల కాలనీలు, గ్రామాలే లక్ష్యంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ మండలాల్లో పోలీసులు వారం రోజుల నుంచి ప్రతి గ్రామం, ప్రతి వీధి జల్లెడ పట్టారు. వారికి గంజాయి తాగేవారితోపాటు అమ్మకాలు జరిపేవారు కూడా దొరికినట్లు సమాచారం. వారి నుంచి భారీ మొత్తంలోనే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అరకు నుంచి గురజాలకు...
పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాలకు చెందిన కొంత మంది స్పోర్ట్స్ బైకులపై అరకు నుంచి రోడ్డు మార్గంలో కాలేజీ విద్యార్థుల్లా ఐడీ కార్డులతో గంజాయి తీసుకొస్తున్నారు. కొంతకాలం క్రితం వీరు రాజమండ్రి పోలీసులకు పట్టుబడటంతో కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. మళ్లీ వచ్చి ఇవే పనులు చేస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణ పోలీసులకు కూడా వీరు చిక్కినట్లు సమాచారం.
శివారు కాలనీల్లో విక్రయాలు
పిడుగురాళ్ల పట్టణ శివారులోని కొన్ని కాలనీలలో ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో తెలుస్తోంది. వారిని పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ఇద్దరు మహిళల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారికి సరఫరా చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం పట్టణంలో ఓ కాలనీలో ముగ్గురిని పట్టుకోగా, వారికి సరఫరా చేసే వ్యక్తి దాచేపల్లి పట్టణంలో ఉన్నాడని విచారణలో తేలింది. అతడి నుంచి కొన్ని కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో గంజాయి తాగే, విక్రయించే వారి బైక్‌లు కూడా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
పెరుగుతున్న వివాదాలు
పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండల కేంద్రాల్లో గంజాయి తాగి యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. బ్యాచ్‌లుగా విడిపోయి గొడవలు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వారిని అదుపు చేయటంలో కూడా పోలీసులు విఫలం అవుతున్నారు. తరచూ గొడవలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది.
గోప్యత వెనుక కారణాలేంటి?
పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ వివరాలు మాత్రం వెల్లడించటం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లారు. గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇది జరిగిన పది రోజుల వ్యవధిలోనే కేజీల గంజాయి నియోజకవర్గంలో పట్టుబడటం, నిందితులను అదుపులోకి తీసుకున్నా వివరాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంతటి వారైనా కఠిన చర్యలు
గంజాయి కేసులలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తాం. – బి.జగదీష్, గురజాల డీఎస్పీ


