అకాల వర్షంతో రైతన్నకు వెతలు
● తడిసిన ధాన్యం, మిర్చి పంటలు.. నేలకూలిన అరటి ● ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వినతి
రెంటచింతల: మండలంలోని వివిధ గ్రామాలలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, పెనుగాలులకు ధాన్యం, మిర్చి పంటలు తడవడంతోపాటు అరటి పంట నేలకూలడంతో అన్నదాతల ఆశలు ఆవిరి అయ్యాయి. రెంటచింతల, పాలువాయి, మంచికల్లు, మల్లవరం, గోలి, మిట్టగుడిపాడు తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీగా పెనుగాలులు వీచాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి పంటలను తడవకుండా కాపాడుకోవడానికి రైతులు పట్టలు తీసుకుని ఉరుకులుపరుగులు పెట్టారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలు తమ కళ్ల ముందే తడవడంతో రైతన్నలకు దిక్కుతోచడం లేదు. తాను సాగు చేస్తున్న 6 ఎకరాల అరటి చెట్లు మొత్తం నేలకూలడంతో సుమారు రూ.5లక్షల వరకు నష్టం వచ్చినట్లు మంచికల్లు గ్రామానికి చెందిన గొంగడి శ్రీనివాసరెడ్డి వాపోయారు. పాలువాయి గ్రామానికి చెందిన ములకా రోసిరెడ్డి, కుంచపు శ్రీనివాసరావు, గుంటా అంజిరెడ్డి, పెద్దిరెడ్డి శేషిరెడ్డి, మేకల వెంకటరెడ్డి, శొంఠిరెడ్డి గురవారెడ్డి, పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తదితర రైతులకు చెందిన మిర్చి, ధాన్యం బస్తాలు ఈ అకాల వర్షానికి తడిసిపోయాయి. గాలి, వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందచేయాలని వారు కోరుతున్నారు.
అకాల వర్షంతో రైతన్నకు వెతలు
అకాల వర్షంతో రైతన్నకు వెతలు


