బాల్య వివాహం నిలిపివేత
నాదెండ్ల: బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన సంఘటన ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసింది. చిలకలూరిపేట మండలం చినరాజాపేట గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరేంద్రతో ఈ నెల 13న బాలిక వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు. బాలిక తండ్రి చనిపోగా, తల్లి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. బాలిక వివాహ సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో స్వరూపారాణి, డీసీటీవో ప్రశాంత్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పద్మ, సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
గర్భిణులు, బాలింతలు సేవలను ఉపయోగించుకోవాలి
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిన కిల్కారి సేవలను ఉపయోగించుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కిల్కారి కాల్ నెంబర్ 012444 51660 అని, కాల్ వచ్చినపుడు ఎత్తి పూర్తిగా సమాచారాన్ని వినగలుగుతారన్నారు. తిరిగి ఆ సమాచారాన్ని వినాలి అంటే 14423 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.


