రైతు కష్టం.. బూడిద పాలు
● 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం ● ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ఘటన ● సుమారు రూ.13లక్షల నష్టం ● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధిత రైతులు
ముప్పాళ్ళ: మండలంలోని గోళ్లపాడు గ్రామంలోని ఆక్రాన్ ఫార్మా కంపెనీ ఎదురుగా పంట పొలాల్లో బుధవారం మంటలు వ్యాపించి సుమారు 13 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామంలో మొక్కజొన్న కోతలు ఊపందుకున్నాయి. పంట కోసిన రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతుంటారు. ఈ క్రమంలోనే నిప్పు పెట్టడంతో ఈదురుగాలులు అధికంగా ఉండటంతో పక్కనే ఉన్న కోత కోయని పొలాలకు మంటలు వ్యాపించాయి. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు పక్క పొలాలకు వ్యాపించాయి. ఈ మంటల్లో మండలంలోని కుందురువారిపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు చెందిన సుమారు 13 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బత్తినేని అచ్చయ్య మూడు ఎకరాలు, కందుల సుబ్బారావు మూడు ఎకరాలు, బొడ్డపాటి చినకోటయ్య ఆరు ఎకరాలు, పుల్లెం వెంకటేశ్వర్లు అర ఎకరం, పుల్లెం భూలక్ష్మి అర ఎకరం కలిపి మొత్తం 13 ఎకరాల్లోని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఎకరం రూ.లక్ష చొప్పున రూ.13 లక్షల నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఎకరాకు సుమారు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టాం. పంట చేతికందే సమయానికి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియటం లేదు. ప్రభుత్వమే ఎకరాకు రూ.లక్ష చొప్పున అందించి ఆదుకోవాలి. లేకుంటే మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది.
–అచ్చయ్య, సుబ్బారావు, చినకోటయ్య, బాధిత రైతులు
రైతు కష్టం.. బూడిద పాలు
రైతు కష్టం.. బూడిద పాలు


