మతాల మధ్య ఘర్షణలకే వక్ఫ్ సవరణ బిల్లు
బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నరసరావుపేట: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని ముస్లిం నాయకుడు షేక్ మస్తాన్‌వలి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం నరసరావుపేట మార్కెట్‌సెంటర్‌లో ముస్లిం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మస్తాన్‌వలి మాట్లాడుతూ ఇతరులకు ముస్లింల వక్ఫ్ ఆస్తులను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశంలో ఇలాంటి బిల్లు తీసుకొని వచ్చి మతాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ బిల్లును ఆపేవరకు తమ పోరాటం సాగుతుందన్నారు. లౌకిక వాదులు, ప్రజా, కుల సంఘనాయకులను కలుపుకొని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. మైనారిటీ నాయకుడు రఫీ మౌలానా, ఆదివాసీ నాయకుడు నాయక్, సీపీఐ నాయకుడు ఉప్పలపాటి రంగయ్య, పీడీఎం నాయకులు నలపాటి రామారావు, జి.రామకృష్ణ పాల్గొన్నారు.


