రాయగడ : రహదారి ఉంది.. కానీ ప్రయాణించడానికి వీల్లేని దుస్థితి. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి. దీంతో అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులే పల్లకీ కట్టి భుజాలపై మోసుకువెళ్లాల్సిందే. జిల్లా పరిధిలోని చంద్రపూర్ సమితి బుడుబాలి గ్రామ పంచాయతీ డెమాగుడ గ్రామంలో నెలకొన్న దయనీయ పరిస్థితి ఇది. చంద్రపూర్ సమితి కేంద్రానికి సుమారు 36 కిలొమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 35 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. కాంబిగుడ కూడలి నుంచి గ్రామానికి వెళ్లే సమారు ఆరు కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలు సాగించడం గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది. అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించేందుకు నానా అవస్ధలు పడుతున్నారు. గ్రామానికి చెందిన సురేంద్ర గులుడాక అనారోగ్యానికి గురికావడంతో గ్రామస్తులు ఆయన్ను భుజాలపై మోసుకుంటూ పుకురా గ్రామం వరకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో చంద్రపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.


