● ఒకరికి కత్తిపోట్లు ● ముగ్గురు అరెస్ట్
కొరాపుట్: విద్యార్థి సంఘ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మర్‌కోట్ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారం కాలేజ్‌లో జరుగుతుంది. అదే సమయంలో బయట వ్యక్తులు కళాశాల ఎదుట గొడవపడ్డారు. అప్పటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు. సాయంత్రం డీఎన్‌కే కాలనీ వద్ద దీప్ కమల్ మహాపాత్రో అనే యువకుడు తన స్నేహితులతో ఇదే విషయం చర్చిస్తున్నాడు. ఇది తెలిసి సుమారు 40 మంది యువకులు అక్కడికి చేరుకొని దాడి చేశారు. దీప్ కమల్ కత్తి పోట్లుకు గురయ్యాడు. అంతలో పోలీసులు రావడం అల్లరి మూక పరారయ్యారు. వెంటనే దీప్ కమల్‌ని డీఎన్‌కే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఉమ్మర్‌కోట్‌లో వర్తక, వాణిజ్య సంస్థలు మూసివేశారు. వాహనాలు నిలిపివేసి ఆందోళనకి దిగారు. కొన్నిచోట్ల దాడుల జరిగాయి. పోలీసులు రంగంలోకి దిగి ఈ కత్తిపోట్లు కారణమైన అబ్దుల్ షేక్, రాహుల్ దీప్, రాజేష్ కలువాను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. డీఎస్పీ ఆధిత్య సేన్, ఐఐసీ సుబేంద్ సబర్, ఎస్‌ఐ కులభూషణ్ నాయక్ ఈ కేసు వివరాలు ప్రకటించారు. మిగతా వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.


