జయపురం: ఇటీవల వచ్చిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని కొట్‌పాడ్ సమితిలోని రైతులు కోరారు. ఈ మేరకు జయపురం సమితి కొట్‌పాడ్ సమితి రైతులు సోమవారం కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ మహాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కుంధ్రా సమితిలో జిల్లా స్థాయి గ్రీవెన్స్‌సెల్‌లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను జిల్లా కృషక్ కళ్యాణ మంచ్ నేతృత్వంలో కలిసిన రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. గత నెల 23, 24, 25 తేదీలలో పడిన భారీ వర్షాల కారణంగా కొట్‌పాడ్ సమితిలో అనేక గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలు వరద నీటిలో మునిగి పోయాయని, పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని, పలు ఇళ్లు కూలిపోయినట్టు వెల్లడించారు. వారందరినీ ఆదుకోవాలని కోరారు.
మల్కన్‌గిరి: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాలను సోమవారం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్థిక ప్రయోజనాలు అందించాలని కోరుతూ ఆల్ ఒడిశా అంగన్‌వాడీ లేడీస్ వర్కర్స అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించారు.
మల్కన్‌గిరి : కలిమెల సమితి కేంద్రంలో ఉన్న ఓ మొబైల్ దుకాణం వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తపస్ మొబైల్ కేర్ పేరిట నిర్వహిస్తున్న ఈ దుకాణంలో యజ మాని వినియోగదారులను ఆకర్షించేందుకు లాటరీ ఆఫర్లను ప్రకటించారు. గెలుపొందిన వారికి కారు, 20 బైక్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు అందిస్తామని ప్రకటించారు. అయితే ఒడిశాలో లాటరీ పేరిట డ్రా నిర్వహించడం చట్టవిరుద్ధ మని ఆరోపిస్తూ మాల్యవంత్ మొబైల్ వ్యాపారులు సోమవారం జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కిషోర్ దాస్‌కు వినతిపత్రం అందజేశారు. సదరు వ్యాపారి ప్రభుత్వానికి పన్ను కూడాసక్రమంగా చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాయగడ: దుర్గాపూజా వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఝార్సుగుడ జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొత్తం 82 దుర్గాపూజా మండపాలు ఏర్పాటైనట్లు ఎస్పీ జి.ఆర్.రాఘవేంద్ర తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రధాన పూజా మండపాలు, రద్దీ ప్రాంతాలు, సమమస్యాత్మక ప్రాంతాలు, ముఖ్యకూడళ్ల వద్ద తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలియజేశారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణ, మహిళల భద్రత, విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వేడుకల్లో పోలీసుల గస్తీ, మోబైల్ పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు నిరంతర నిఘా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. రావణ దహన కార్యక్రమాలు జరిగే ప్రధాన ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలు అధికంగా గుమిగూడే ప్రాంతాల్లో అదనపు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం, మహిళలను వేధించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, మత సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేడులు సజావుగా సాగేందుకు పూజా కమిటీలు, స్థానిక యంత్రాంగం, ఇతర సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పరస్పన సామరస్యంతో దుర్గాపూజలను నిర్వహించాలని, పూజా కమిటీలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.


