నవరాత్రి శోభ | - | Sakshi
Sakshi News home page

నవరాత్రి శోభ

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

జాజ్‌పూర్‌లో.. నవరాత్రి శోభ

న్యూస్‌రీల్‌

సింహధ్వజ రథంపై బిరజా మాత

నాభిగయలో పితృకార్యాల విశిష్టత

మంగళవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
జాజ్‌పూర్‌లో..

భువనేశ్వర్‌:

విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రాచీన సంస్కృతికి నిలయం ఒడిశా. అటువంటి పవిత్ర భూమిలోని జాజ్‌పూర్‌ పట్టణం శక్తి ఆరాధనకు, పితృదేవతల పూజలకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన మా బిరజా దేవి ఆలయం అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటిగా భక్తుల విశేష ఆదరణ పొందుతోంది. సతీదేవి నాభి పడిన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని భక్తులు విశ్వసిస్తారు. అందుకే బిరజా క్షేత్రానికి శాక్తేయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రం ప్రత్యేకత అమ్మవారి విగ్రహ రూపంలోనూ కనిపిస్తుంది. సాధారణ దుర్గామాత విగ్రహాలకు భిన్నంగా, రెండు చేతులతో మహిషాసురుడిని శూలంతో సంహరిస్తున్న రూపంలో బిరజా దేవి దర్శనమిస్తారు. సింహంపై నిలిచి ఉన్న అమ్మవారి ఈ రూపం శక్తి, ధర్మ విజయానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ప్రస్తుత ఆలయం 13వ శతాబ్దానికి చెందినది. శతాబ్దాలుగా కొనసాగుతున్న పూజా సంప్రదాయాలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నాయి.

తొమ్మిది రోజుల రథయాత్ర ..

శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే బిరజా మాత రథయాత్ర ఈ క్షేత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. ఒడిశాలో అమ్మవారి పేరిట తొమ్మిది రోజుల పాటు సాగే ఈ రథోత్సవం విశిష్టమైనది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి మహానవమి వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ‘సింహధ్వజ’ రథంపై అధిష్ఠింపజేసి, ఆలయ ప్రాంగణం చుట్టూ రోజూ ఊరేగిస్తారు. గంటల నాదాలు, శంఖధ్వనులు, భక్తుల జయజయధ్వానాల మధ్య సాగే ఈ యాత్రలో అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. దేవి రథంపై ఊరేగడం ద్వారా భక్తులకు మరింత చేరువవుతుందనే విశ్వాసం ఈ ఉత్సవానికి ప్రత్యేకతను చేకూరుస్తోంది.

నాభిగయ ...పితృకార్యాలకు ప్రసిద్ధి

బిరజా ఆలయ సముదాయంలో ఉన్న నాభిగయ ఈ క్షేత్రానికి మరో విశిష్ట గుర్తింపు. పితృదేవతలకు పిండప్రదానం, శ్రాద్ధకర్మలు నిర్వహించేందుకు ఇది ప్రసిద్ధ పుణ్యస్థలం. భారతదేశంలోని ప్రముఖ గయా క్షేత్రాల సంప్రదాయంలో భాగంగా భావించే నాభిగయలో పితృకార్యాలు నిర్వహిస్తే పూర్వీకులకు శాంతి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. వైతరణి నదీ తీరంలోని బిరజా క్షేత్రం పితృతీర్థంగా కూడా పేరొందింది. శక్తి ఆరాధనతో పాటు పితృదేవతల పూజలకు ప్రాధాన్యం ఉండటం ఈ క్షేత్ర యాత్రకు ప్రత్యేక ఆధ్యాత్మిక పరిమాణాన్ని అందిస్తోంది.

ఆధ్యాత్మికత ... సంప్రదాయాల సమ్మేళనం

అమ్మవారి దర్శనం, తొమ్మిది రోజుల రథయాత్ర, నాభిగయలో పితృకార్యాలు ... ఇలా ఒకే క్షేత్రంలో విభిన్న ఆధ్యాత్మిక అనుభవాలను పొందే అవకాశం బిరజా పీఠం ప్రత్యేకత. ప్రాచీన ఆలయ నిర్మాణం, శాక్తేయ ఆరాధనా పద్ధతులు, తరతరాలుగా కొనసాగుతున్న ఉత్సవాలు జాజ్‌పూర్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది బిరజా మాత రథయాత్ర అక్టోబర్‌ 11న ప్రారంభమై, అక్టోబర్‌ 19న మహానవమితో ముగియనుంది. శరన్నవరాత్రుల వేళ బిరజా క్షేత్రం భక్తుల రాకతో ఆధ్యాత్మిక సందడిని సంతరించుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement