రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం గుణుపూర్ సబ్ కలక్టర్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సంయుక్త ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 58 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఇద్దరు లబ్ధిదారులకు కలెక్టర్ రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిలీప్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ విశ్వంబర్ బెహరా, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయకుమార్ ప్రధాన్, గుణుపూర్ బీడీఓ స్వస్ధిక్ జమాదార్, తహసీల్దార్ లీలావతి ఆచార్య, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్‌కుమార్ నాయక్, ఎస్‌డీపీఓ బబులి నాయక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమారావ్, జిల్లా విద్యాశాఖ అధికారి భజన్‌లాల్ మాఝి తదితరులు పాల్గొన్నారు.
ఆర్.ఉదయగిరిలో గ్రీవెన్స్‌సెల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి సమితి కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్సుసెల్‌కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్‌కుమార్ సాహు, సబ్ కలెక్టర్ భాగవత్ సామల్‌కళ్యాణ్ రావ్, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరులు హాజరై 16 వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇద్దరికి రూ. పది వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్.ఉదయగిరి సమితి అధ్యక్షులు లక్ష్మీనారాయణ శోబోరో, తహసీల్దారు జ్యోతిర్మయి దాస్, బీడీఓ లారీమాన్ ఖర్సల్ తదితరులు పాల్గొన్నారు.
ఐఐటీ భువనేశ్వర్‌లో ‘
మానస్విత’ వర్క్‌షాప్
భువనేశ్వర్: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఐఐటీ భువనేశ్వర్ ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిర్వహించిన రెండు రోజుల ‘మానస్విత’ వర్క్‌షాప్ విద్యార్థుల మానసిక స్థైర్యం, ఆరోగ్య పరిరక్షణ, సహాయక క్యాంపస్ వాతావరణ నిర్మాణంపై కీలక చర్చలకు వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా 25 విద్యాసంస్థలకు చెందిన 90 మంది ప్రతినిధులు, 20 మందికి పైగా నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను ముందుగానే గుర్తించడం, సకాలంలో స్పందించడం, అధ్యాపకులు– విద్యార్థుల మధ్య సానుకూల సంబంధాలు, తోటివారి మార్గదర్శకత్వం, జీవన నైపుణ్యాల అభివృద్ధిపై వర్క్‌షాప్‌లో చర్చించారు. జీవనశైలి సంబంధిత అనారోగ్యాలు, అసంక్రమిత వ్యాధుల నివారణపైనా అవగాహన కల్పించారు. ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపద్ కర్మాళ్కర్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సుకు ఆహ్లాదకరమైన క్యాంపస్ వాతావరణం, పరస్పర గౌరవం, సహాయక సంబంధాలు కీలకమని పేర్కొన్నారు. ఆనందం, జీవన నైపుణ్యాలపై ప్రత్యేక కోర్సు, విద్యార్థులందరికీ సైక్లింగ్ నైపుణ్యాన్ని తప్పనిసరి చేయడం, ‘చింతన్‌ఛాయ’ బహిరంగ తరగతి గది వంటి సంస్థ కార్యక్రమాలను వివరించారు. కేంద్ర విద్యా శాఖ ఉన్నత విద్యా విభాగం డైరెక్టర్ దేవేంద్రకుమార్ శర్మ మాట్లాడుతూ, శ్రేయస్సు విద్యకు అదనపు అంశం కాదని, అది విద్యకు పునాది అని పేర్కొన్నారు. ఐఐటీ గాంధీనగర్ మాజీ డైరెక్టర్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైనన్ ఉపాధ్యాయులు – విద్యార్థుల మధ్య గౌరవప్రదమైన సంబంధాల ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో ఐఐటీ భువనేశ్వర్ డీన్లు ప్రొఫెసర్ మిహిర్ కుమార్ దాస్, ప్రొఫెసర్ శ్యామల్ చటర్జీ, వర్క్‌షాప్ కన్వీనర్ డాక్టర్ అనిర్బన్ భట్టాచార్య పాల్గొన్నారు.


