● వివిధ రూపాల్లో అమ్మవారి దర్శన భాగ్యం
రాయగడ: నవరాత్రి ఉత్సవాల రెండో రోజున అమ్మవారు బాలాత్రిపుర సుందరి, గాయత్రి రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. స్థానిక రైల్వే కాలనీలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గాయత్రి రూపంలో, కస్తూరీనగర్‌లోని సత్యనారాయణ మందిరంలోని లక్ష్మీ అమ్మవారు బాలాత్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా నిత్యపూజలు కొనసాగుతున్నాయి. స్థానిక హతీపధర్ రోడ్డు సమీపంలోని నీలట్యాంక్ కాలనీ వద్ద దసరా ఉత్సవాలను మూడు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ అందరినీ ఆకర్షిస్తుండగా నవరాత్రుల రెంరో రోజైన సోమవారం అమ్మవారికి అక్కడి వారు కుంకుమ పూజలను నిర్వహించారు. ఇక ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జిగౌరీ అమ్మవారు సునాబొసొలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ప్రాంగణంలో నిత్యదీపాలు వెలుగుతూ ఆకర్షిస్తున్నాయి.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: పట్టణంలోని పెద్దబ్రాహ్మాణవీధి జంక్షన్‌లో ఏటా ఆడంబరంగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు వరుసాగా 65వ సారి ఘనంగా పూజలు చేసి ఆదివారం అర్ధరాత్రి తరువాత అమ్మవారి దర్శనం కల్పించారు. పాతబస్టాండు వరకూ విద్యుద్దీపాలతో అలరారుతున్న దుర్గాదేవిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. విజయదశమి వరకూ ఈ దేవీ నవరాత్రి వేడుకలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలియజేశారు. రెండో రోజైన సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి.


