తెలుగు సంస్కృతి పరిరక్షణలో విశేష కృషి
కోసల్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్
హరిబాబు
భువనేశ్వర్:
మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే స్థానిక సమాజంతో మమేకమై ప్రగతిపథంలో పయనిస్తున్న ప్రవాసాంధ్రులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధులుగా నిలుస్తున్నారని ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రశంసించారు. యువతరం తెలుగు వారసత్వం పట్ల గర్వపడుతూ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. అట్టాబిరలో జరిగిన 23వ కోసల్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆయనతో సతీమణి జయశ్రీ కంభంపాటి పాల్గొన్నారు. హిరాకుడ్ డ్యామ్ ప్రాజెక్టు అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో సుమారు ఆరు దశాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు పశ్చిమ ఒడిశాలో స్థిరపడ్డారని గవర్నర్ గుర్తుచేశారు. స్థానిక ప్రజలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకుంటూనే తెలుగు భాష, ఆచారాలు, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ వస్తుండటం అభినందనీయమన్నారు. ఉగాది, సంక్రాంతి వంటి పండుగల నిర్వహణ ద్వారా సాంస్కృతిక వినిమయాన్ని పెంపొందించడం, తరతరాల మధ్య అనుబంధాలను బలోపేతం చేయడంలో కోసల్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు. తెలుగు సంప్రదాయాల పరిరక్షణతోపాటు కుటుంబ, సామాజిక బంధాలను పటిష్ఠం చేయడంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతిపాదిత శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తి, సంస్కృతి, విద్య, సామాజిక సేవలకు కేంద్రంగా ఎదగగలదని గవర్నర్ ఆకాంక్షించారు. యువత తెలుగు వారసత్వాన్ని గౌరవిస్తూనే సాంకేతికత, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్య, వ్యవస్థాపకత, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒడిశా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అట్టాబిర ఎమ్మెల్యే నిహార్ రంజన్ మహానంద్, ఫ్లూయెంట్ గ్రిడ్ సీఈఓ గన్నిమణి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


