రాయగడ: విద్యార్థి నాయకుల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు, పక్షపాతం చోటు చేసుకున్నాయంటూ జిల్లాలోని బిసంకటక్‌లోని మా మార్కమా డిగ్రీ కళాశాల ఆర్ట్స్ విభాగం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంపిక ప్రక్రియను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. అయితే విద్యార్థుల ఆరోపణలను కళాశాల యాజమాన్యం ఖండించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే విద్యార్థి నాయకుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశ్విని కుమార్ పండ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన కళాశాలలో విద్యార్థి సంఘం నాయకుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. విద్యార్థుల సమ్మతితో ఎన్నికల అధికారి సమక్షంలో వివిధ పదవులకు ప్రతినిధులను ఎంపిక చేసినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. ఎంపికై న ప్రతినిధుల తుది జాబితాను ఈ నెల 15వ తేదీన ప్రకటించి.. 16వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే ఎంపిక ప్రక్రియ ముగిసిన మూడు రోజుల తరువాత ఆర్ట్స్ విభాగం విద్యార్థులు నిరసనకు దిగడం వివాదానికి దారితీసింది. ఎంపికలో భారీగా అక్రమాలు జరిగాయని, కొంతమంది విద్యార్థులకు అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపిక ప్రక్రియను మరోసారి నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ కళాశాలలోని ఆర్ట్స్, సైన్స్ విభాగాలకు సంబంధించి మొత్తం పది విభాగాల నుంచి ఒకొక్క విభాగానికి ముగ్గురు చొప్పున్న విద్యార్థి నాయకులను ఎంపిక చేసినట్లు కళాశాల యాజమాన్యం వివరించింది. ఎంపికై న ప్రతినిధుల సమ్మతితోనే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి తదితర పదవులకు ప్రతినిధులను నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రిన్సిపాల్ డాక్టర్ పండ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా ఈ ఆందోళన వెనక కొందరు రాజకీయ నాయకులు, విద్యార్థులు కానివారి ప్రమేయం ఉందనే చర్చకూడా స్థానికంగా సాగుతోంది. అయితే ఈ వాదనలపై అధికారిక నిర్ధారణ వెలువడలేదు. విద్యార్థుల ఆరోపణలు, కళాశాల యాజ మాన్యం వివరణల నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంతో వేచి చూడాల్సిందే.


