న్యాయవాదులు నిస్వార్థ సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులు నిస్వార్థ సేవలు అందించాలి

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

రాయగడ: సమాజంలో పేదలు, నిరుపేదలకు న్యాయ సహాయం అందించడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణకు న్యాయవాదులు నిస్వార్ధంగా కృషి చేయాలని అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి దేవాశీష్‌ త్రిపాఠి పిలుపునిచ్చారు. స్థానిక తేజస్వీ హోటల్‌లో పరిషత్‌ 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సన్యాసిరాజు, సహాయ కార్యదర్శి నుపేంద్ర నారాయన్‌ బాగ్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. న్యాయవాదులు బాధ్యతలు, ప్రజలకు నిస్వార్ధంగా న్యాయ సహాయం అందించడం, దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు కిశోర్‌ కుమార్‌ సాహు, రాయగడ శాఖ కార్యదర్శి సత్యనారాయణ ప్రధాన్‌, కోశాధికారి సీతారాం పండ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రాబోయే రోజుల్లో రాయగడ జిల్లాలోని పేదలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయపరమైన సలహాలు అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు కిశోర్‌కుమార్‌ సాహు తెలిపారు. అనంతరం పరిషత్‌ ప్రతినిధులు వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

తమిళనాడులో రాయగడ యువకుడు మృతి

రాయగడ: వలస కూలీగా తమిళనాడుకు వెళ్లిన రాయగడ జిల్లా కళ్యాణసింగుపూర్‌ సమితి సునాఖుంటి పంచాయితీ పరిధిలోని ఖజురీగుడ గ్రామానికి చెందిన రామారావు కులసిక (36) మృతి చెందాడు. 15 రోజుల క్రితమే కూలి పనుల కోసం తమిళనాడులోని ఈరోడ్‌కు వెళ్లిన ఈయన ఓ ప్రైవేట్‌ కంపెనీలొ పనిచేస్తున్న సమయంలో ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలిసింది. చావుకు కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడే మృతదేహం ఉంది. మృతదేహాన్ని స్వగ్రామానికి ఎలా తీసుకురావాలనే ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో వైపు కొడుకు మృతి సమాచారం తెలుసుకున్న వృద్ధ తల్లి విషాదంలో మునిగిపోయింది. కాగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం తరఫున సహాయం అందిస్తున్నట్లు జిల్లా కార్మిక శాఖ అధికారి రవీంద్రనాథ్‌ త్రిపాఠి తెలిపారు. తమిళనాడు నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌ అద్దెను రెడ్‌ క్రాస్‌ నిధుల నుంచి చెల్లించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

చిలికాలో చిక్కుకుపోయిన పడవ

ప్రయాణికులు సురక్షితం

భువనేశ్వర్‌: ప్రయాణికులతో ఉన్న పడవ చిలికా సరస్సు మధ్యలో చిక్కుకుపోయింది. సోమవారం ఉదయం పూరీ జిల్లాలో సతొపొడా నుండి జొహ్నికుదొ వైపు వెళ్తుండగా యాంత్రిక లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఆ పడవలో 10 మంది ప్రయాణికులున్నారు. సతొపొడా ఘాట్‌ నుంచి జొహ్నికుదొ వైపు ప్రయాణిస్తున్న పడవలోని మోటారు ఇంజిన్‌ మొరాయించడంతో మొహిషి కుదొ సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. సుమారు ముప్పావు గంట దిక్కు తోచని పరిస్థితిలో సరస్సు మధ్యలో చిక్కుకుపోయి ప్రయాణికులు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమన్నారు. అదృష్టవశాత్తూ ప్రజలు, వాహనాలతో కూడిన మరో ప్రయాణికుల పడవ ఆ ప్రాంతానికి సమీపించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పడవలోని వారు చిక్కుకుపోయిన పడవను గమనించి రెండవ పడవ చేయూతనిచ్చి ఆదుకుంది. రెండో పడవ ఒక తాడును ఉపయోగించి చిక్కుకుపోయిన పడవను సరస్సు గుండా జొహ్నికుదొ ఘాట్‌ వైపు లాగింది. దాదాపు 2 గంటల తర్వాత ఆ పడవ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ప్రయాణికులకు ఉపశమనం కలిగింది. పడవలోని 10 మంది ప్రయాణీకులను ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా గమ్యం చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement