పర్లాకిమిడి:
నేరడి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పట్టణంలో కలెక్టరేట్ గేటు వద్ద ’వంశధార బచావ్...ఒడిశా బచావ్’ అనే సత్యాగ్రహం మంగళవారం దండకారణ్య వికాస్ మంచ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ ఆందోళనలో దండకారణ్య వికాస్ అధ్యక్షులు గౌరచంద్ర త్రిపాఠి, నవరంగ్‌పూర్ విశ్రాంత బ్యాంకు అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ సాహు, న్యాయవాది మనోజ్ కుమార్‌పాత్రో, బీజేడీ నాయకులు ప్రదీప్ కుమార్ నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, పర్లాకిమిడి పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు పాల్గొన్నారు. ఉత్కళ సమ్మేళనం తరఫున రిటైర్టు తహసీల్దార్ పూర్ణచంద్ర మహాపాత్రో ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిశా ప్రభుత్వం దక్షిణ ఒడిశా అయిన రాయగడ, గజపతి, నవరంగ్‌పూర్, కోరాపుట్ జిల్లాలకు ప్రాంతీయ వైషమ్యాలు సృష్టిస్తోందని అన్నారు. గుణుపురం వద్ద నేరడి ప్రాజెక్టు పనులు సాగితే ఒడిశాలోని కాశీనగర్ ప్రాంతంలో ఏడు గ్రామాలు, గుణుపురంలో కొన్ని గ్రామాలు ముంపునకు గురి కావడమే కాకుండా వేలాది ఎకరాలు పంట భూములు జలమయం అవుతాయని తత్ఫలితంగా కాశీనగర్ వాసులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు మాట్లాడుతూ, వంశధార ఎడమ కాలువ ప్రాజెక్టు వల్ల కాశీనగర్ బ్లాక్‌లో ఖండవ, సరా, బడిగాం కాకుండా మరో ఐదు గ్రామాలు ముంపునకు గురవుతాయని అందువల్ల ఈ నేరడి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వంశధార నది ప్రాంతీయ ఆందోళన కోఆర్డినేటరు బ్రోజమోహాన్ నాయక్, ఖండవ పంచాయితీ సమితి సభ్యులు జగన్నాధ దోర, నేతృత్వంలో సరా, బడిగాం, ఖండవ గ్రామ ప్రాంతాల నుంచి అనేక మంది రైతులు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నేరడి ప్రాజెక్టు వ్యతిరేక సభ, సత్యాగ్రహంలో పాల్గొన్న ఆందోళనకారులు నేరడి ప్రాజెక్టును బంద్ చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.


